మాది పేదలపక్షం

4 Feb, 2015 02:21 IST|Sakshi
మాది పేదలపక్షం

 పేదల సంక్షేమం, వ్యవసాయం, పారిశ్రామికానికి ప్రాధాన్యం
 టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి భేటీలో మూడు ప్రాథమ్యాలను ఆవిష్కరించిన కేసీఆర్

 
 సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణను ఎలా ముందుకు తీసుకెళ్లాలో సమాలోచనలు చేశాం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడు లక్ష్యాలతో పనిచేస్తుంది. నిరుపేదల పక్షపాతిగా ఉంటుంది. వారి సంక్షేమానికే తొలి ప్రాధాన్యం. రెండోది వ్యవసాయం. ఈ రంగం నుంచి ఖజానాకు ఆదాయం తక్కువైనా ఎక్కువ మంది ప్రజలకు అదే ఆధారం. రైతన్నలు సల్లగుంటేనే మనం పిడికెడు అన్నం తింటం.. సుఖంగా శాంతంగా ఉంటం. మూడోది, రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధించాలంటే, యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఈ దిశలో పని విధానాన్ని విభజన చేసుకుని ముందుకుపోతున్నాం’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కొంపల్లిలో మంగళవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, ఇతర అంశాలను కార్యకర్తలకు ఆయన ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రంలో అర్హుడైన ప్రతి ఒక్క వ్యక్తికీ సాయం చేస్తామని, వెనక్కి పోయే ప్రసక్తే లేదని కేసీఆర్ తెలిపారు. ఆకలి చావుల నేతన్నలు, వివిధ వృత్తుల్లో కష్టాలు పడుతున్న వారి బాధలన్నీ వరుసగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. పంట రుణాల మాఫీకి రూ. 17 వేల కోట్ల భారాన్ని మోశామన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అక్కడి రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ కార్యక్రమం ఈ బడ్జెట్ తర్వాత వేగవంతమవుతుందని, ఉద్యోగుల పంపిణీని కమలనాథన్ కమిటీ పూర్తి చేశాక కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపడతామని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి రెండో విడత సిద్ధమవుతున్నామని, ప్రతీ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ఏటా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రులు, అధికారులు తొలుత అమరవీరులకు నివాళులర్పించాకే జాతీయ జెండావిష్కరణ చేస్తారన్నారు. ఇందుకు రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామన్నారు.
 
 అత్యుత్తమ పారిశ్రామిక విధానం తెచ్చాం
 
 ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సింగిల్ విండో విధానంలో పారిశ్రామిక చట్టాన్ని తెచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని, కేవలం 15 రోజుల్లోనే ఒకే చోట అన్ని రకాల అనుమతులిస్తామని, ఈ విధానానికి దేశ, విదేశాల నుంచి అభినందనలు అందాయని సీఎం పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి కూడా దీన్ని అభినందించారని చెప్పారు. ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్, పోలీసు శాఖ ఆధునీకరణ, షీ టీమ్స్ ఏర్పాటు, మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మైనారిటీల సంక్షేమం, లంబాడ తండాలను పంచాయతీలుగా మార్చడం, పెన్షన్లు, రేషన్ బియ్యం, హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ వంటి ప్రభుత్వ పథకాల గురించి కార్యకర్తలకు కేసీఆర్ వివరించారు.
 
 విద్యుత్ కష్టాలూ తొలగుతాయ్
 
 గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యుత్ రంగంపై నిర్లక్ష్యం వహించడంతో ఇప్పుడు కష్టాలు తప్పడం లేదని, త్వరలోనే అవి తొలగిపోతాయని సీఎం పేర్కొన్నారు. ఎన్‌టీపీసీ నుంచి 4 వేల మెగావాట్లు, జెన్‌కో నుంచి 6000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కృష్ణ పట్నం నుంచి రావాల్సిన విద్యుత్‌ను చంద్రబాబు అడ్డుకుంటున్నాడని, సీలేరు కరెంటుకూ ఎగబడుతున్నాడని విమర్శించారు. భూపాలపల్లి నుంచి 600 మెగావాట్లు, జైపూర్ నుంచి 1200 మెగావాట్ల విద్యుత్ అందనుందన్నారు. ప్రస్తుతం 1300 మెగావాట్లు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ సీజన్ వరకు ఇబ్బంది పడినా, మూడేళ్ల తర్వాత రెప్పపాటు కూడా కరెంటు పోకుండా నిరంతర విద్యుత్ అందిస్తామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
 
 
 రాజకీయాల్లో ఓపిక ఉండాలి
 
  ‘రాజకీయాల్లో అందరికీ పదవులు రావు. కొందరికి అనుకోకుండా వస్తాయి. తమ వంతు కోసం ఎదురు చూడాలి. ఓపిక ఉండాలి. తొందరపడితే భవిష్యత్తు దెబ్బతింటుంది. పార్టీకి ఇబ్బందులు ఉంటాయి. సామాజిక, కుల సమీకరణలుంటాయి. చెట్టు నీడనే ఉండాలి. కచ్చితంగా పండు దొరుకుతుంది. ఈ మధ్యే మనం పక్కా రాజకీయ పార్టీగా మారాం. మరో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. రాష్ట్రంలో మరో పార్టీకి భవిష్యత్తు లేదు. టీఆర్‌ఎస్‌కు మాత్రమే స్థానం ఉంటుంది’ అని కార్యకర్తలకు కేసీఆర్ హితవు చెప్పారు. ఓపికతో ఉంటే పదవులు ఎలా దక్కుతాయో చెప్పడానికి.. నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ అనిత, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉదంతాలను ఉదహరించారు. నియోజకవర్గాల్లో నేతలంతా సమన్వయంతో పనిచేయాలని, తాను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌తో మాట్లాడానని, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలవుతుందని ఆయన చెప్పారని వివరించారు. నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. వ్యవసాయ మార్కెట్ల పాత కమిటీల రద్దుపై కోర్టు తీర్పు ఉన్నందున ఆర్డినెన్సు జారీ చేశామని, ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయని చెప్పారు.
 
 ఒకే ఒక్కడు!
 
 టీఆర్‌ఎస్ విస్త్రృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ మాత్రమే ప్రసంగించారు. దాదాపు గంటన్నరపాటు ఆయన ప్రసంగించాక సమావేశం ముగిసింది. మిగిలిన నేతలెవరికీ అవకాశమివ్వకపోవడం గమనార్హం. అభిప్రాయాలు చెప్పకుండానే సమావేశాన్ని ముగించడం పార్టీ నాయకుల్లో చర్చనీయాంశమైంది. వేదికపైకి పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, 12 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు మినహా ఎవరినీ ఆహ్వానించలేదు. పార్టీ ప్రజా ప్రతినిధులంతా వేదిక కిందే ఉండిపోయారు. సీఎం సభకు వచ్చే వరకు రసమయి బాలకిషన్ సహా పలువురు కళాకారులు ఆడిపాడారు. కాగా, ఈ భేటీకి మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య హాజరయ్యారు. ఆయన కూర్చున్న చోటుకు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెళ్లి పలకరించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
 

>
మరిన్ని వార్తలు