రైతులు సంతోషంగా ఉన్నారా?

17 Aug, 2019 03:31 IST|Sakshi
సీఎంకు పంపిన మూలవాగు నీటిప్రవాహచిత్రాలు

వరద కాలువకు నీళ్లు వస్తున్నాయా?  

ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీలకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌ 

బోయినపల్లి: ‘‘ఏం సంగతి, అంత మంచిదేనా..! వరద కాలువకు నీళ్లు వస్తున్నాయా?..రైతులు సంతోషంగా ఉన్నారా.. మిడ్‌మానేరు నింపుదామా?’’అని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, మాజీ జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డిలను సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో ఆరా తీశారు. శుక్రవారం సీఎం వారిద్దరికీ ఫోన్‌ చేసి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘సర్‌.. మీరు నీళ్లు ఇవ్వడంతో రైతులు సంతోషంగా ఉన్నారు’అని వేణు, లచ్చిరెడ్డి సమాధానం చెప్పారు.

వరద కాలువకు నీరుఎంత వస్తుందని సీఎం ప్రశ్నించగా.. 1,600 క్యూసెక్కులు వస్తున్నాయని వారు చెప్పగా.. లేదు ఏడు వేల క్యూసెక్కుల నీరు వస్తుందని సీఎం పేర్కొన్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు నింపుకుందామా? అని అడుగగా.. నింపుకుం దాం సార్‌.. కానీ, ముంపు గ్రామాల్లో గెజిట్‌ మిస్సింగ్, వృత్తుల్లో తప్పులు ఉన్నాయి.. అని సీఎంకు వివరించారు. ‘అవి చేద్దాం..  మీరు ఈ రోజే కలెక్టర్‌ను కలవండి’అని కేసీఆర్‌ ఆదేశించారు.  ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని కోరగా..‘ఆడిట్‌ ప్రాబ్లం ఉంటుంది. ఒక్క ప్రాజెక్టుకు ఇస్తే అన్నిటికీ ఇవ్వాలి చూద్దాం’ అని సీఎం సమాధానమిచ్చారు.

నీటి ప్రవాహాల చిత్రాలు పంపండి 
వరద కాలువ పరిసరాల్లోకి వెళ్లి ఫోన్‌లో మాట్లాడాలని సీఎం ఆదేశించడంతో వారు అక్కడికెళ్లి మాట్లాడారు. సీఎం కోరిక మేరకు నీటి ప్రవాహాల చిత్రాలు పంపారు.

మరిన్ని వార్తలు