తొలి విడతలోనా.., మలి విడతలోనా?

10 Jan, 2019 10:19 IST|Sakshi
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి

అమాత్య పదవులపై ... ఉమ్మడి జిల్లాలో ఆగని చర్చ

సాక్షిప్రతినిధి, నల్లగొండ: అమాత్య పదవులపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. సరిగ్గా నెల రోజుల ముందటే ముగిసిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను, ఏకంగా తొమ్మిది చోట్ల టీఆర్‌ఎస్‌ విజయదుందుభి మోగించింది. ఈ తొమ్మిది మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌ మాత్రమే తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో ఇతర పార్టీల్లోనూ ఎమ్మెల్యేలుగా గెలిచి ఈసారి టీఆర్‌ఎస్‌ నుంచి మూడో విజయాన్ని అందుకున్న వారిలో నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, రెండో విజయాన్ని అందుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఉన్నారు.

ఇక, టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, గాదరి కిశోర్, గొంగిడి సునిత, పైళ్ల శేఖర్‌రెడ్డి , ఎన్‌.భాస్కర్‌రావు రెండోసారి విజయాలు సాధించారు. వీరిలో ఈసారి కేబినెట్‌లో బెర్త్‌ ఎవరికి ఖరారు అవుతుందన్నదే ఇప్పుడు ప్రధానంగా సాగుతున్న చర్చ. గత 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జి.జగదీశ్‌రెడ్డి తెలంగాణ తొలి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు రెండోసారి కూడా విజయం సాధించారు కాబట్టి ఆయనకు తిరిగి అమాత్య పదవికి దక్కుతుందని, రెండోసారి మంత్రి కావడం ఖాయం అన్నది పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఉమ్మడి జిల్లా ప్రాతిపదిక మంత్రులను తీసుకుంటారా..? లేక, కొత్త జిల్లాల ప్రాతిపదికన ఎంపిక చేస్తారా అన్న ప్రశ్నపై సరైన సమాధానం ఎవరి వద్దా లేదు. ఒకవేళ నల్లగొండ జిల్లా నుంచి కూడా మంత్రిని తీసుకోవాల్సి వస్తే అవకాశం ఎవరికి తలుపు తడుతుందన్న అంశం చర్చకు ఆస్కారం ఇస్తోంది.
 
రేసులో.. జగదీశ్‌రెడ్డి.. గుత్తా సుఖేందర్‌రెడ్డి ?
గతంతో పోలిస్తే.. ఈసారి జిల్లా నుంచి మూడు స్థానాలు అధికంగా టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. గత ఎన్నికల్లో గెలిచిన రెండు స్థానాలు నకిరేకల్, మునుగోడును కోల్పోయినా, తొలిసారి మిర్యాలగూడ, కోదాడ, నాగార్జున సాగర్, దేవరకొండ, నల్లగొండ స్థానాలను దక్కించుకుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారంతా సీనియర్లుగానే కనిపిస్తుండడంతో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ నెలకొన్నా.. ప్రధానంగా రేసులో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉన్నారని చెబుతున్నారు.

ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా కేబినెట్‌ ర్యాంకులో రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌కు బాధ్యత వహిస్తున్నారు. శాసన మండలి సభ్యుడిగా ఆయనకు అవకాశం కల్పించి, మంత్రి వర్గంలోకి తీసుకుంటారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇద్దరు నాయకులు మంత్రి పదవి రేసులో ఉన్నట్లు అవుతోంది. ఈ ఇద్దరు నేతలకు అవకాశం కల్పిస్తారా..?  ఒకవేళ కల్పిస్తే తొలి విడతలో ఎవరిని తీసుకుంటారు..? మలి విడత దాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏ నేత ఎదుర్కోనున్నారు అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి.

పార్లమెంటరీ కార్యదర్శులను నియమిస్తే...?
తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రులకు తోడు పార్లమెంటరీ కార్యదర్శుల పోస్టులను క్రియేట్‌ చేసి బాధ్యతలు అప్పజెప్పారు. మంత్రులకు సహాయకంగా (ఒక విధంగా సహాయ మంత్రులు) వీరికి శాఖలు కూడా కేటాయించారు. కానీ, కోర్టు కేసు వల్ల ఈ వ్యవస్థను రద్దు చేశారు. ఈసారి చట్టాన్ని మార్చి, కోర్టు గొడవలేం లేకుండా, పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థకు ఊపిరి పోస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి.

ఒకవేళ ఈ అంశం నిజరూపం దాలిస్తే.. అవకాశం ఎవరికి దక్కుతుందన్న చర్చా నడుస్తోంది. గతంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు పార్లమెంటరీ కార్యదర్శి పదవి దక్కింది. మరోవైపు గత శాసన సభలో ప్రభుత్వ విప్‌గా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వంలో వీరికి ఏ పదవులు దక్కుతాయన్న అంచనాలు మొదలయ్యాయి. ఈనెల 18వ తేదీన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో జిల్లాలో నేతల అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు