తెలంగాణకు ‘హరితహారం’

10 Aug, 2014 00:56 IST|Sakshi
తెలంగాణకు ‘హరితహారం’

పథకాన్ని ప్రకటించిన సీఎం
అడవులు లేకపోవడం వల్లే కరవుకాటకాలు
వ్యవసాయ వర్సిటీకి అనుబంధంగా ఫారెస్టు కాలేజీ

 
హైదరాబాద్: తెలంగాణకు ‘ హరితహారం’ అనే పథకానికి రూపకల్పన చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావు వెల్లడించారు. రాష్ట్రంలో మొక్కల పెంపకం, ఫారెస్టు కాలేజీ, హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర అంశాలపై శనివారం ఆయన సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో గ్రీన్ కవర్ ఎక్కువ ఉండేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అందుకే హరిత హారం పథకాన్ని రూపొందిస్తున్నామన్నారు.  కరువు కాటకాలకు, వర్షాభావ పరిస్థితులకు చాలినంత అడవి లేకపోవడమే కారణమన్న అవగాహన ప్రజల్లో రావాలని సీఎం కోరారు.తెలంగాణలో అడవులకు సంబంధించిన విద్యను అందించడం కోసం ఫారెస్టు కాలేజీని నెలకొల్పుతామని సీఎం ప్రకటించారు.

తమిళనాడులోని మెట్టుపాలెం వద్ద ఫారెస్టు కాలేజీ ఉందనీ... అందులో చదివిన చాలామంది విద్యార్థులు ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారని సీఎం తెలిపారు. అలాంటి ఫారెస్టు కాలేజీని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఏర్పాటు చేస్తామన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో అందుకు అనువైన స్థలాన్ని ఇప్పటికే పరిశీలించినట్టు చెప్పారు.ఈవర్సిటీకి అనువైన స్థలాన్ని కూడా ఎంపిక చేయాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు