అవసరమైతే మళ్లీ లాక్‌డౌన్‌ : కేసీఆర్‌

28 Jun, 2020 16:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం. అవసరమైతే హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించనన్నుట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో కరోనా వైరస్ నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ఖరారు చేయనున్నట్టు చెప్పారు. జీహెచ్‌‌ఎంసీ పరిధిలో మరోసారి కొద్దిరోజుల పాటు లాక్‌డౌన్‌ విధించే ప్రతిపాదనపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. నగరంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అందరికీ వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. కరోనా నియంత్రణ, చికిత్స, సంబంధిత అంశాలపై చర్చించేందుకు ఆదివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కర్యాదర్శి సోమేశ్‌కుమార్‌.. ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో కరోనా వ్యాప్తి, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కరోనాకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని మంత్రి ఈటల రాజేందర్‌ సీఎంకు వివరించారు.  (తెలంగాణ పోలీసు అకాడమీలో 180 మందికి కరోనా )

‘కరోనా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. అదేవిధంగా తెలంగాణలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. జాతీయ సగటుతో పోల్చితే.. తెలంగాణలో కరోనా మరణాల రేటు తక్కువగా ఉంది. కరోనా బాధితులకు అవసరమైన చికిత్స అందిస్తున్నాం.. ప్రజలు భయపడాల్సి పనిలేదు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌, కాలేజ్‌ల్లో వేల సంఖ్యలో బెడ్లను సిద్ధంగా ఉంచాం. పరిస్థితి విషమంగా ఉన్నవారికి ఆస్పత్రులలో ఉంచి చికిత్స అందిస్తాం. లక్షణాలు లేని వారికి ఇంటి వద్దే చికిత్స అందజేస్తాం’అని మంత్రి ఈటల తెలిపారు. ప్రభుత్వానికి పంపిన తాజా నివేదికలో కూడా తెలంగాణలో వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, కోవిడ్ వల్ల మరణించిన వారి జాతీయ సగటు 3.04 ఉండగా, తెలంగాణలో అది కేవలం 1.52 మాత్రమే అని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు.

అనంతరం కేసీఆర్‌ స్పందిస్తూ.. ‘హైదరాబాద్‌ పెద్ద నగరం. ఇక్కడ కోటి మంది నివసిస్తున్నారు. మిగతా నగరాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక.. ప్రజలు అన్నిచోట్ల తిరగడం కరోనా వ్యాప్తికి కారణం అయింది. చెన్నైలో కూడా మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. దేశంలో మరికొన్ని నగరాలు కూడా ఈ దిశలో ఆలోచన చేస్తున్నాయి. వైద్య నిపుణులు కూడా హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధించడం మంచిదని ప్రతిపాదిస్తున్నారు. కానీ మరోసారి లాక్‌డౌన్‌ విధించడం అనేది చాలా పెద్ద నిర్ణయం. అందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాల్సి ఉంది. ముఖ్యంగా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలి. అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుని కేబినెట్‌ భేటీలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’ అని తెలిపారు. (కరోనా కాలంలో ఈ పండ్లు తింటే బేఫికర్‌! )

మరిన్ని వార్తలు