కేంద్రంలో చక్రం తిప్పేది కేసీఆరే

27 Mar, 2019 14:54 IST|Sakshi
ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు

 ఎంఐఎంతో కలిసి 17 స్థానాలను కైవసం చేసుకుంటాం 

 సీఎం కేసీఆర్‌ పథకాలను కాపీ కొడుతున్నారు 

 కాంగ్రెస్‌కు అభివృద్ధి తెలియదు, టీడీపీ దుకాణం బంద్‌ 

 రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దయాకర్‌ రావు 

సాక్షి, భూపాలపల్లి: ఎన్నికల అనంతరం కేంద్రంలో చక్రం తిప్పేది సీఎం కేసీఆరే అని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి 17 స్థానాలు కైవసం చేసుకుని కేంద్రంలో చక్రం తిప్పుతామన్నారు.మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఎస్సార్‌ ఫంక్షన్‌హాల్‌ నిర్వహించిన టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. వరంగల్‌ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి అధిక మెజారిటీ ఇస్తే అభివృద్ధి ఆగదని మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. వరంగల్‌ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌ మాట్లాడుతూ.. తనకు అధిక మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

చక్రం తిప్పేది మనమే.. 
ఫెడరల్‌ఫ్రంట్‌ ఆధ్వర్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 16 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే చక్రం తిప్పడమే కాదు ఏకంగా ఢిల్లీ గడ్డపై కేసీఆర్‌ కూర్చుండే అవకాశం ఉందని ఆయన అన్నారు. అన్ని ఎంపీ స్థానాల్లో గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నడుచుకుంటూ వస్తోందన్నారు. 16 ఎంపీ స్థానాలు ఉంటేనే కేంద్రంలో చక్రం తిప్పుతారా అని బీజేపీ, కాంగ్రెస్‌ విమర్శలు చేస్తున్నాయని, కేవలం 2 ఎంపీ స్థానాలతో తెలంగాణ తెచ్చిన విషయం మర్చిపోయారా అని గుర్తు చేశారు.

దేశం మొత్తం టీఆర్‌ఎస్‌ పథకాలనే కాపీ కొడుతుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో 24 గంటల కరెంట్‌ లేదు, రైతుబంధు లేదు, అభివృద్ధి పనులు లేవని విమర్శించారు. తెలంగాణలో టీడీపీ దుకాణం ఎత్తేసిందని  త్వరలో ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి అధిక మెజారిటీతో పసునూరి దయాకర్‌రావును గెలిపించారని, ఈ సారి కూడా అదే స్ఫూర్తితో భారీ మెజారిటీ అందించాలని కార్యకర్తలను కోరారు. ఏ గ్రామంలో అయితే 80 శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌కు వస్తాయో ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని దయాకర్‌రావు అన్నారు. 

65వేలకు పైగా మెజారిటీ రావాలి.. 
లోక్‌సభ ఎన్నికల్లో భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 65 వేలకు పైగా మెజారిటీ రావాలని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు. అభివృద్ధి రుచిచూడాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. వందకు వందశాతం 16 స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ, కాళేశ్వరానికి జాతీయ హోదా, గిరిజన యునివర్సిటీని కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని, స్వయంగా కేసీఆరే ప్రధానిని అడిగిన పట్టించుకోలేదన్నారు. అదే మనకు 16 స్థానాలు ఉంటే అన్నింటిని సాధించుకోవచ్చని కడియం శ్రీహరి అన్నారు.

పొరపాట్లు జరిగేతే క్షమించండి.. 
తన వల్ల పొరపాట్లు జరిగితే క్షమించాలని, ఎంపీ ఎన్నికల్లో మాత్రం భారీ మెజారిటీ అందించి పసునూరి దయాకర్‌ను గెలిపించాలని మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి కోరారు. భూపాలపల్లి నియోజకవర్గానికి ఎంపీ ఎన్నికలు మంచి అవకాశమని, అభివృద్ధి చెందడానికి మరో అవకాశం వచ్చిందని అన్నారు. భూపాలపల్లి అభివృద్ధి కోసం ఓట్ల రూపంలో కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని ఆయన అన్నారు.   

జిల్లా కేంద్రం ఇక్కడే.. కానీ కండీషన్‌ అప్లై
ఇటీవల జిల్లా కేంద్రం తరలింపుపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్న తరుణంలో కార్యకర్తల సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. మధుసూదనాచారి జిల్లా కేంద్రం తరలింపుపై స్పష్టత ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లిని కోరారు. ఎర్రబెల్లి ప్రసంగించే సమయంలో జిల్లా కేంద్రం ఎక్కడికి పోదని, అన్ని కార్యాలయాలకు భవనాలు ఇక్కడే కట్టిస్తాం అని అన్నారు. అయితే ఇది మీరిచ్చే మెజారిటీపై ఆధారపడుతుందని కార్యకర్తలతో అన్నారు. మెజారిటీ రాకపోతే జిల్లా కేంద్రం తరలింపుపై ఆలోచించాల్సి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు జిల్లా కార్యకర్తలు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు