రైతుబంధు దేశవ్యాప్తంగా అమలు చేస్తాం : కేసీఆర్‌

12 Dec, 2018 16:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల సైకాలజీ బాగాలేదని టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు విమర్శించారు. జాతీయ పార్టీలు దొందూ దొందేనని, అధికారం కోసం చిల్లమల్లర రాజకీయాలు చేయడం వాటికి పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఓట్లకోసం జాతీయ నాయకులు సైతం అబద్ధాలు ఆడుతున్నారని ఆయన ఎండగట్టారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేసీఆర్‌ ఆ పార్టీ శాసభసభా పక్షనేతగా బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం పూర్తి గెజిట్‌ విడుదలైన తర్వాతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని తెలిపారు. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం కల్పిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగ భృతి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 70 వేల కోట్ల రూపాయలు అవసరమని తెలిపారు.

త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌
ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. జర్నలిస్టు సంక్షేమానికి ఇప్పటికే 100 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేశామని, మరిన్ని నిధులు కేటాయించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తామన్నారు. రాష్ట్రం అప్పులు పాలైందన్న విమర్శలను తిప్పికొట్టిన కేసీఆర్‌... అన్ని అంశాలపై తమకు పూర్తి అవగాహన ఉందని, ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. అందుకే మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా తాము అమలు చేశామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ... ‘పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం మా ముందున్న సవాల్‌. హైకోర్టు ఆర్డర్‌ను అమలు చేయాలి. వచ్చే వారంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. రెండు దఫాలుగా ఎన్నికలు జరుగుతాయి’ అని వ్యాఖ్యానించారు. కంటి వెలుగు, అమ్మ ఒడి, కేసీఆర్‌ కిట్‌, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలే తమ పార్టీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టాయని కేసీఆర్‌ అన్నారు. జాతీయ పార్టీలు దేశంలో ఒక పాలసీ, రాష్ట్రానికో పాలసీ ప్రకటిస్తూ ప్రజలని మోసం చేస్తున్నాయని ఆరోపించారు.

రైతు బంధు దేశవ్యాప్తంగా అమలు చేస్తాం
ప్రజాస్వామ్యంలో కేంద్ర- రాష్ట్రాల మధ్య అధికార వికేంద్రీకరణ జరిగినపుడే సమాఖ్య విధానానికి నిజమైన స్ఫూర్తి ఉంటుందని కేసీఆర్‌ పేర్కొన్నారు. కేంద్రం తన పని తాను చేయకుండా రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తోందని విమర్శించారు. అందుకే దేశ రాజకీయాల్లో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అనేక దేశాలు అంతర్జాతీయంగా తమ పంటను అమ్ముకునేందుకు రైతులకు అవకాశం కల్పిస్తుంటే మనకు మాత్రం అలాంటి అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర దేశవ్యాప్తంగా ప్రకటించాల్సి ఉంటుంది అలా జరిగినపుడే అన్ని రాష్ట్రాల రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.

దేశానికి కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానం వచ్చినపుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రైతు, వివిధ వర్గాల సంక్షేమం కోసం జాతీయ స్థాయి రాజకీయాల్లో కొత్త ప్రయోగాలకు తాను సిద్ధమవుతున్నానని.. ఫెడరల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి రాగానే రైతు బంధు వంటి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని, అందుకు సంబంధించిన బడ్జెట్‌పై కూడా అవగాహన ఉందని కేసీఆర్‌ తెలిపారు.

ఇక పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారానికి తప్పకుండా వెళ్తానని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ‘కచ్చితంగా ఏపీకి వెళ్తా. అక్కడికి రావాలని నాకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్కేక హోదా అవసరం లేదని ఆ రాష్ట్ర సీఎం చెప్పారు. హోదా సంజీవని కాదు. మూర్ఖులే హోదా అడుగుతారని అన్నారు. మరి ఇప్పుడేమో ఆయనే హోదా కోసం పోరాడుతున్నారు’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు