ఒక్కరోజే 10 కరోనా పాజిటివ్‌ కేసులు: కేసీఆర్‌

27 Mar, 2020 16:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 10 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఇప్పటి వరకు 59 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 58 మందికి చికిత్స కొనసాగిస్తున్నామన్నారు. ఒకరు పూర్తిగా కోలుకుని వెళ్లారని చెప్పారు. హోం క్వారంటైన్‌తో పాటు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లలో సుమారు 25వేల మంది పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు.

ప్రగతిభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. 'లాక్‌డౌన్‌ చేయకుండా ఉంటే భయంకర పరిస్థితులుండేవి. మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం సామాజిక దూరం. లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు. ఉదయం ప్రధాని మోదీతో మాట్లాడాను.. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఐసోలేషన్‌ వార్డుల్లో 11వేల మందికి చికిత్స అందే ఏర్పాట్లు చేశాము. 1400 ఐసీయూ బెడ్స్‌ సిద్ధం చేస్తున్నాము. 60వేల మందికి వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేశాం. రిటైర్‌ అయిన వైద్యులు, మెడికల్‌ సిబ్బందిని వినియోగించుకుంటాం. యుద్ధం చేసే సమయంలో నిర్లక్ష్యం, అలసత్వం పనికిరాదు. వైద్యులు, అధికారులు, పోలీసు సిబ్బందికి ప్రజలు సహకరించాలి' అని కేసీఆర్‌ అన్నారు.

'తెలంగాణ సమాజానికి దండం పెట్టి చెబుతున్నా.. గత్తర బిత్తర కావొద్దు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవాళ్లందరికి ఆహార వసతి ఏర్పాటు చేస్తాం.. ఎక్కడివాళ్లు.. అక్కడే ఉండండి. ఇతర రాష్ట్రాల ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో హాస్టల్స్‌ మూసివేయరాదు. 50 లక్షలకుపైగా ఎకరాల్లో పంట చేతికొచ్చే సమయమిది. ఎస్‌ఆర్‌ఎస్పీ, కాళేశ్వరం, నాగార్జునసాగర్‌, జూరాల ప్రాజెక్ట్‌ల కింద ఏప్రిల్‌ 10 వరకు నీటి సరఫరా చేయాలని ఆదేశాలిచ్చాము. బావులు, బోర్లపై ఆధారపడ్డ రైతులకు విద్యుత్‌ సమస్యలు లేకుండా చూస్తాము. నిత్యావసరాలు, కూరగాయల కోసం ఇంటి నుంచి ఒక్కరే వెళ్లాలి. ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు ఆహార వసతి కల్పించి.. వైద్య సేవలు అందించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చాము. నిరాశ్రయులకు ఆహార వసతి కల్పిస్తాం. పశుగ్రాసం రవాణా చేసే వాహనాలకు అనుమతి ఉంది. చికెన్‌, గుడ్లు తింటే కరోనా వస్తుందనేది అవాస్తవం. బలవర్దక ఆహారం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది' అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా