ఆ 11 మంది రేపు డిశ్చార్జ్‌ : కేసీఆర్‌

29 Mar, 2020 20:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏప్రిల్‌ 7 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12 మంది తప్ప మిగిలిన కరోనా బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అవుతారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదయ్యే అవకాశం తక్కువగా ఉందని అన్నారు. తెలంగాణలో 70 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. డిశ్చార్జ్‌ అయిన వ్యక్తితో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. కరోనా పాజిటివ్‌ తేలి చికిత్స పొందుతున్నవారిలో 11 మందికి నెగిటివ్‌ వచ్చిందని.. వారిని రేపు(సోమవారం) డిశ్చార్జ్‌ చేయనున్నట్టు వెల్లడించారు. మిగిలిన 58 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 25,938 మంది క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు. 

ఈ గండం నుంచి బయటపడేవరకు ప్రజలు ప్రభుత్వానికి హకరించాలని కేసీఆర్‌ కోరారు. కరోనాపై లాక్‌డౌన్‌ కు మించిన ఆయుధం లేదని చెప్పారు. లాక్‌డౌన్‌ పెట్టడం వల్లే భారత్‌కు మేలు జరిగిందని ప్రపంచ దేశాలన్నీ అంటున్నాయని చెప్పారు. దక్షిణ కొరియాలో ఒక వ్యక్తి ద్వారా కరోనా వైరస్‌ 59 మందికి సోకిందన్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారిని రోజుకు రెండుసార్లు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తే తక్కువ నష్టంతో బయటపడగలమని తెలిపారు. 

ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది.. 
తెలంగాణలో 50 లక్షల ఎకరాల్లో పంట సాగు అవుతుందని కేసీఆర్‌ చెప్పారు. 30 లక్షల ఎకరాల్లో వరిసాగు, 14.50 లక్షల టన్నుల మొక్కజొన్న పంట సాగు అవుతుందన్నారు. మొక్కజొన్నను కనీస ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. అయితే రైతులకు ఒక పద్దతి ప్రకారం కూపన్ల మీద ఉన్న తేదీల్లోనే కొనుగోలు కేంద్రాలకు రావాలని సూచించారు. 1.05 కోట్ల టన్నుల వరి వచ్చే అవకాశం ఉందన్నారు. మొత్తం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. మార్కెటింగ్‌ శాఖ సిబ్బంది అంతా గ్రామాల్లోనే ఉండి.. రైతుల పంటను కొనుగోలు చేస్తారని చెప్పారు. కరోనా నివారణ కోసమే మార్కెట్‌ యార్డులు మూసివేశామన్నారు. కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలు కలిసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తారని అన్నారు. 

క్లిష్ట పరిస్థితుల్లో రూ. 25 వేల కోట్లు సమీకరించాం..
పంట కోతకు తెలంగాణలో 5వేల హార్వెస్టర్లు ఉన్నాయని.. ఇతర రాష్ట్రాల నుంచి 1500 హార్వెస్టర్లు తెప్పిస్తున్నామని తెలిపారు. మనం యుద్దం స్థితిలో ఉన్నామని రైతులు గుర్తించాలన్నారు. ప్రభుత్వం చొరవ చూపి.. రైతుల కోసం చర్యలు చేపడుతోందని వివరించారు. ప్రభుత్వానికి రైతులందరూ సహకరించాలని కోరారు. కచ్చితంగా రైతులందరూ  కొనుగోలు కేంద్రాలకు నియంత్రణతో సామాజిక దూరం పాటించాలని సూచించారు. పంట కొనుగోలుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని.. రాష్ట్ర ఆర్థిక వనరులన్నీ పడిపోయాయని చెప్పారు. కరోనా పరిస్థితి ఇంకా ఎంత కాలం ఉంటుందో తెలియదని.. అయినా రైతులు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేస్తామని వెల్లడించారు. క్లిష్ట పరిస్థితిలోనూ సివిల్‌ సప్లయ్‌కు రూ. 25 వేల కోట్లు సమీకరించామని చెప్పారు. రోగ నిరోధక శక్తి పెంచే బత్తాయి, నిమ్మ పండ్లను మార్కెట్ల వద్ద అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 

వలస కార్మికులకు బియ్యం, రూ. 500
కనీస మద్దతు ధరతో ధాన్యం కనుగోళ్లకు రైస్‌ మిల్లర్లను కూడా అనుమతిస్తామని కేసీఆర్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం రైస్‌ మిల్లర్లలో సమావేశం కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో వ్యవసాయ, మార్కెటింగ్‌, సివిల్‌సప్లైయ్‌ జిల్లా అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారంలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. వలస కార్మికలు రేషన్‌ కార్డు లేకపోయినా ప్రతి వ్యక్తికి 12 కేజీల బియ్యం, రూ. 500 ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు.  అవసరమైన చోట కల్యాణ మండపాల్లో వలస కార్మికులకు వసతి, భోజనం కల్పిస్తామని చెప్పారు. అవసరమైన దానికంటే 30 శాతం వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందిని సమకూరుస్తున్నామని వివరించారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. 

కఠిన శిక్షలు తప్పవు..
కరోనా వైరస్‌కు ఎవరూ అతీతులు కారని.. బ్రిటిష్‌ ప్రధానికే కరోనా సోకిందని గుర్తుచేశారు. కరోనా తీవ్రతపై ప్రభుత్వం వాస్తవాలను వెల్లడిస్తుందన్నారు. అలాంటప్పుడు తప్పుడు ప్రచారం చేయాల్సి అవసరం ఏముందని ప్రశ్నించారు. అలాంటి వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు