ఈటల నా కుడి భుజం.. కేసీఆర్‌

20 Nov, 2018 15:42 IST|Sakshi

సాక్షి, హుజురాబాద్‌, సిద్దిపేట : ఉద్యమంలో ఎలా పాల్గొన్నారో.. అభివృద్ధిలో కూడా అలానే ఈటల రాజేందర్‌ కష్టపడతారని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ అన్నారు. హుజురాబాద్‌లో ఈరోజే సర్వే రిపోర్ట్ వచ్చిందని, రాజేందర్‌కు 80 శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారు. రాజేందర్ తనకు కుడిభుజం అని, లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. మంగళవారం ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా హుజురాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. కేసీఆర్‌ మాట్లాడుతూ.. 'హుజురాబాద్‌లో భయంలేదు. కొత్తగా చెప్పేది ఏమిలేదు, అంతా మీకు తెలుసు. దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా వెలుగొందుతున్నాం. కాంగ్రెస్ అధికారంలో వస్తే‌ కరెంట్ ఉండదు. యాసంగి పంటకు సాగునీళ్ళు అందిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హుజురాబాద్‌లో నిర్మించిన చెక్ డ్యామ్‌లు 365 రోజులు జలకళతో ఉంటాయి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా అద్బుత పథకం రూపకల్పన చేశాం. వచ్చే ప్రభుత్వంలో అమలు చేస్తాం. తెలంగాణా మొత్తాన్ని క్రాప్ కాలనీలుగా విభజిస్తాం. రైతుల బతుకులు బంగారుమయం కాబోతున్నాయి' అని కేసీఆర్‌ తెలిపారు.

అంతకు ముందు సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. 'సిద్దిపేట జిల్లా కావాలనుకుని సాధించాము. చాలా హుషారైన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మీకు పనులు బాగా జరుగుతున్నాయి. రేపటి తెలంగాణలో వ్యవసాయం ఏవిధంగా ఉండబోతుందో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజలకు చెప్పాలి. సిద్దిపేట, దుబ్బాక ప్రజలు చాలా గట్టివాళ్లు. అనుకున్నయి సాధిస్తారు. నేను మీరు పెంచిన బిడ్డనే. ఈ రోజు ఇక్కడికి అతిథిగా వచ్చి మాట్లాడుతున్నా. నేను చదువుకున్న దుబ్బాక హైస్కూల్ భవనాన్ని కూడా బ్రహ్మాండంగా కడుతున్నాము. హరీశ్‌రావు, రామలింగారెడ్డిలను లక్ష చొప్పున భారీ మెజారిటీతో గెలిపించాలి' అని కేసీఆర్‌ అన్నారు.

'గత నాలుగున్నర సంవత్సరాలుగా చేసిన పని మీ అందరి ముందు ఉంది, ఎన్నికల పరీక్ష వచ్చింది. ఈ పరీక్షలో నాకు ఎన్ని మార్కులు వేస్తారో మీ చేతుల్లో ఉంది' అని ఆపధర్మ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లాలో కరువు అంటు ఉండదని ఆపధర్మ మంత్రి  ఈటల రాజేందర్‌ చెప్పారు. వాటర్ హబ్‌గా కరీంనగర్ జిల్లా మారబోతుందని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి రెండు పంటలకు సాగునీరు అందిస్తామని హామీఇచ్చారు. పేదలు, బీపీఎల్‌కు దిగువనున్న వారి గురించి కేసీఆర్ అలోచిస్తున్నారని కేశవరావు అన్నారు. ప్రజలు కోరుకున్నదే చేయబోతున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు