ముఖ్యమంత్రివా? ఉద్యమకారుడివా?

21 Mar, 2019 03:11 IST|Sakshi

కేసీఆర్‌ భాషపై కిషన్‌రెడ్డి ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: పరిపాలన, ఉద్యమం రెండూ వేర్వేరని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన భాషను మార్చుకోవాలని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజలు ఎవరూ మిమ్మల్ని హిందూత్వ నిర్వచనం గురించి అడగలేదు. అడగకున్నా ఎందుకు లేవనెత్తుతున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఎలా గెలిపించారో, పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీని అలా గెలిపిస్తారు. మేము ఇంకా ప్రచారమే మొదలు పెట్టలేదు. మా ప్రచారాన్ని కేసీఆర్‌ మొదలు పెట్టారు.

ఆయనంత హిందూత్వవాది ప్రపంచం లో ఎవరూ లేరట, యాగాలు యజ్ఞాలు చేయడం హిం దూత్వ కాదు. హిందుత్వం అంటే దేశభక్తి, జాతీయ భావం. అది నీకు లేదని ఎవరూ అనడం లేదు. నీ పక్కన ఒవైసీని కూర్చోబెట్టుకొని హిందూత్వ గురించి ఏం మాట్లాడుతున్నా వ్‌? మైనారిటీల ఓట్ల కోసమే కదా? ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చారన్న చర్చకు సిద్ధమా? లోక్‌సభలో ఎప్పుడన్నా 5 నిమిషాలు మాట్లాడిన ముఖమా నీది కేసీఆర్‌? తెలంగాణ ప్రజల ఆత్మ బలిదానాలతో తెలంగాణ వచ్చింది. అమరుల కుటుంబాలతో చర్చ కు సిద్ధమా? ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చావు? నువ్వు దేశాన్ని నడుపుతావా? మహిళా మంత్రి లేదు, 70 రోజుల వరకు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయలేదు.

రాజ్యాంగానికి విరుద్ధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ.. దేశంలో గుణాత్మక మార్పు తెస్తారట. కనీసం 3 వేల మందికైనా డబుల్‌ బెడ్రూంలు ఇవ్వలేదు. పైగా పోజులు. తెలంగాణ విమోచన అధికారికంగా నిర్వహిస్తామని చెప్పాడు. ఇప్పుడు ఆ విషయం గుర్తుకొస్తే ప్యాంట్‌ తడుస్తోంది. నీటిపారుదల శాఖలో అవినీతి జరుగుతోంది. నీవు ఎన్నికల్లో పెడుతున్న డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది. ప్రగతి భవన్‌లో ముద్రిస్తున్నావా? తెలంగాణలో దేశంలోనే రికార్డ్‌ స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నా యి. ఇదేనా ఆయన తెచ్చిన గుణాత్మక మార్పు? కేసీఆర్‌ దేశంలో అధికారంలోకి వస్తే దేశంలో మద్యం ఏరులై పారిస్తాడు. కేసీఆర్‌ పాలన, మోదీ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధం. ఓటమి భయంతోనే కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. పిట్టకథలు, సినిమా కథలు ఆయనకు అలవాటే’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు