'సీసీఎంబీలో పరీక్షలకు అనుమతివ్వండి'

21 Mar, 2020 02:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ (సీసీఎంబీ) సెంటర్‌ను ఉపయోగించుకునేందుకు అనుమతివ్వాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కేవలం తెలంగాణ వారికే కాకుండా దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారికైనా సీసీఎంబీలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని కేసీఆర్‌ ప్రధాని దృష్టికి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సీసీఎంబీని జీవ సంబంధ పరిశోధనల కోసం ఉపయోగిస్తున్నారని, పరీక్షలకు అనుమతిస్తే ఏకకాలంలో వెయ్యి శాంపిళ్లు పరీక్షించే అవకాశం ఉందన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణలో కేంద్రంతో కలసి పనిచేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

శుక్రవారం సాయంత్రం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు. విదేశాల నుంచి వస్తున్న వారి ద్వారానే వైరస్‌ ప్రబలే అవకాశం ఉన్నందున కొన్ని రోజులపాటు విదేశాల నుంచి విమాన రాకపోకలను పూర్తిగా నిలిపేయాలన్నారు. రైళ్ల ద్వారా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉన్నందున రైల్వే స్టేషన్లలో వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు రైల్వే స్టేషన్లు, బోగీల్లో పారిశుద్ధ్య చర్య లు చేపట్టాలని కేసీఆర్‌ కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి పెద్ద నగరాలకు పెద్ద ఎత్తున విదేశాల నుంచి ప్రయాణికులు వస్తారని, వారికి క్షుణ్ణంగా కోవిడ్‌ వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. జనసమ్మర్థం ఎక్కువ ఉండే ప్రధాన నగరాలపై దృష్టి కేంద్రీకరించి కోవిడ్‌ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కేసీఆర్‌ కోరారు. పండుగలు, ఉత్సవాలకు దూరం...: కోవిడ్‌ వ్యాప్తి నిరోధ చర్యలను కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానికి వివరించారు. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవడంతోపాటు శ్రీరామ నవమి, జగ్నే కీ రాత్‌ వంటి పండుగలు, ఉత్సవాలను రద్దు చేశామన్నారు. 

>
మరిన్ని వార్తలు