‘కృష్ణా–గోదావరి’కి సహకరించండి 

5 Oct, 2019 03:37 IST|Sakshi
శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో కరచాలనం చేస్తున్న సీఎం కేసీఆర్‌ 

ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి

తెలుగు రాష్ట్రాల్లో బీడు భూములకు సాగునీరు అందిస్తామని వెల్లడి

కృష్ణాకు గోదావరి జలాల తరలింపుపై ఏపీతో కలసి కొత్త ప్రాజెక్టుకు నిర్ణయించాం

కేంద్రం ప్రత్యేక సాయం చేయాలని విజ్ఞప్తి

ప్రధానితో పలు అంశాలపై కేసీఆర్‌ చర్చ 

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో బీడు భూము లకు సాగునీరు అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో కలసి చేపట్టనున్న కృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి ఉదారంగా సాయం అందించాలని సీఎం కె.చంద్రశేఖర్‌ రావు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ప్రధానితో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ప్రధాని నివాసానికి ఒక్కరే వెళ్లిన కేసీఆర్‌... సుమారు 50 నిమిషాలపాటు సమా వేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నదుల అనుసంధా నం, ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ఆంధ్ర ప్రదేశ్‌ పునర్విభజన చట్టం అమలు సహా జోనల్‌ వ్యవస్థలో మార్పు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు.

తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనకరం.. 
తెలుగు రాష్ట్రాల్లో సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృష్ణా–గోదావరి నదుల అనుసంధానానికి కొత్త ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రధానికి సీఎం కేసీఆర్‌ వివరించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు విషయమై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డితో పలుమార్లు చర్చించానని, ఇరు రాష్ట్రాల అధికారులు కొంతకాలంగా సాంకేతిక అంశాలపై విస్తృత అధ్యయనం జరుపుతున్నారని ప్రధానికి వివరించినట్లు తెలిసింది. వీలైనంత తక్కువ భూసేకరణ, తక్కువ నష్టంతో గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించాలని నిర్ణయించామని వివరించినట్లు సమాచారం.

ఈ ప్రాజెక్టు ద్వారా రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో నీటి పంపకాలు చేసుకోవాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చాయని ఆయన వివరించినట్లు తెలిసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా సాయం అందించాలని ప్రధానికి కేసీఆర్‌ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే కాళేశ్వరం లేదా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఏదో ఒక దానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరారు.

ఆర్థిక సాయం పెంచండి..
ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయం తగ్గుతోందని, దీన్ని కొంత మేరకు అధిగమించేందుకు కేంద్ర పన్నుల వాటా పెంచాలని ప్రధానిని సీఎం కేసీఆర్‌ కోరినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా రూ. 450 కోట్లను కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉందని, గత ఐదేళ్లలో నాలుగుసార్లు విడుదలైనప్పటికీ ఒక ఏడాదికి సంబంధించిన నిధులు ఇంకా విడుదల కాలేదని కేసీఆర్‌ వివరించారు. వెనుకబడిన జిల్లాలకు నిధులను కొత్త జిల్లాలకు అనుగుణంగా ఇవ్వాలని కేసీఆర్‌ కోరినట్లు తెలియవచ్చింది.

ఇక నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు మిషన్‌ కాకతీయ పథకానికి రూ. 5,000 కోట్లు, మిషన్‌ భగీరథకు రూ.19,205 కోట్లు విడుదల చేయాలని కోరారు. అలాగే మిషన్‌ భగీరథ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిన హర్‌ ఘర్‌ జల్‌ పథకానికి అనుసంధానించాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. వెనుకబడిన ప్రాంతాల్లో 4 వేల కి.మీ మేర రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేసీఆర్‌ కోరారు. అలాగే వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే రహదారుల పనులకు 60:40 నిష్పత్తిలో కాకుండా 100 శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించాలని విన్నవించారు. సెంట్రల్‌ యూనివర్సిటీ తరహాలో పూర్తిగా కేంద్రం ఖర్చుతో వరంగల్‌లో గిరిజన యూనివర్సిటీ నెలకొల్పాలని, వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కు కోసం రూ. వెయ్యి కోట్ల నిధులను గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా అందించాలని కోరారు.

హైదరాబాద్‌–నాగ్‌పూర్, వరంగల్‌–హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని కేసీఆర్‌ కోరారు. జహీరాబాద్‌ నిమ్జ్‌కు నిధులు కేటాయించాలని, వరద కాల్వలకు సవరించిన అంచనాల మేరకు నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులు విడుదల చేయాలని ప్రధానిని కేసీఆర్‌ కోరారు. అలాగే నేషనల్‌ హైవేస్‌ అథారిటీ సహకారంతో ఆదిలాబాద్‌ జిల్లాలో సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పరిశ్రమను పునరుద్ధరించాలని విన్నవించారు.

జోనల్‌ వ్యవస్థలో మార్పులు చేయాలి..
ప్రజల ఆకాంక్షల మేరకు ములుగు, నారాయణపేట జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసుకున్నామని, వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ గద్వాల జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌ పరిధిలోకి మార్చాలని నిర్ణయించామని, ఈ మార్పులకు అనుగుణంగా జోనల్‌ ఉత్తర్వులు సవరించి రాష్ట్రపతి ఉత్తర్వుల జారీకి సహకరించాలని ప్రధానిని సీఎం కేసీఆర్‌ కోరినట్లు తెలిసింది.

జడ్జీల సంఖ్య పెంపు.. విద్యాసంస్థల ఏర్పాటుపై వినతి..
తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాలని ప్రధానిని సీఎం కేసీఆర్‌ కోరారు. తెలంగాణలో ఐఐఎంతోపాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌)ను నెలకొల్పాలని కోరారు. హైదరాబాద్‌కు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ సహా అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఉండాలన్న నిర్ణయం మేరకు రాష్ట్రంలోని అన్ని కొత్త జిల్లాలకు వాటిని కేటాయించాలని కోరారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని, పీపీపీ పద్ధతిలో కరీంనగర్‌లో ఐఐఐటీ నెలకొల్పాలని కోరారు. ఇక కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీక అయిన రామప్ప దేవాలయన్ని ప్రపంచ వారసత్వ సంసదగా గుర్తించాలని కోరారు.

రిజర్వేషన్ల పెంపుపై వినతి..
తెలంగాణలో రిజర్వేషన్లు పెంచాలని, ముస్లింలలోని వెనుకబడిన కులాలకు 12 శాతం రిజర్వేషన్లతో కలపి మొత్తం బీసీలకు 37 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, రిజర్వేషన్లు కల్పించాలని ప్రధానిని కేసీఆర్‌ కోరారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన మేరకు రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ చేపట్టాలని, మహిళలకు పార్లమెంటు, అసెంబ్లీలో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. కాగా, ప్రధాని ఇటీవల చేపట్టిన అమెరికా పర్యటన గురించి సీఎం కేసీఆర్‌ ఈ భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ముఖ్యంగా హ్యూస్టన్‌లో నిర్వహించిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన విషయాన్ని మోదీతో కేసీఆర్‌ పంచుకున్నట్లు సమాచారం.

కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌సింగ్‌లతోనూ భేటీ..
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను మధ్యాహ్నం 1.30 గంటలకు కలిశారు. సుమారు 40 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించారు. అమిత్‌ షాతో భేటీలో కేసీఆర్‌ వెంట ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ప్రధానితో భేటీ అనంతరం సాయంత్రం 5.35 గంటలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కూడా కేసీఆర్‌ కలిశారు. ఈ సందర్భంగా స్కైవేల నిర్మాణానికి అవసరమైన కంటోన్మెంట్‌ భూముల బదలాయింపు సహా వివిధ ప్రాజెక్టులకు రక్షణ భూముల కేటాయింపులపై ఆయనతో చర్చించినట్లు తెలిసింది.

కంటోన్మెంట్‌ ప్రాంతంలో సచివాలయ భవనం, రహదారుల విస్తరణకు రక్షణ భూములను బదలాయించాలని రాజ్‌నాథ్‌ను కేసీఆర్‌ కోరారు. రాజ్‌నాథ్‌తో 20 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో కేసీఆర్‌ వెంట టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేకే, ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, బండ ప్రకాశ్, రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, వెంకటేష్‌ నేత, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు