తెలంగాణకు బొగ్గు కేటాయించండి

4 Feb, 2015 04:00 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుదుత్పత్తి అవసరాలకు బొగ్గు బ్లాక్‌లతోపాటు తగినంత బొగ్గును, రాష్ట్రానికి 500 మెగావాట్ల విద్యుత్‌ను కేటాయించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రధానికి సీఎం వేర్వేరుగా రెండు లేఖలు రాశారు.  ‘విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకు ఉపయోగపడేలా 36 బొగ్గు బ్లాక్‌లను కేటాయించేందుకు కేంద్ర ఇంధనశాఖ ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేసింది. రెండోదశ నిర్మాణంలో కాకతీయ థర్మల్ వపర్ ప్రాజెక్టు ఈ ఏడాది రెండో అర్ధం లో పూర్తవుతుంది. దీనికి ఏటా 2.5 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం. ఈ ప్రాజెక్టుకు తాడిచెర్ల-1 కోల్‌బ్లాక్ నుంచి బొగ్గు కేటాయించారు. గత ఏడాది సెప్టెంబరు 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ బ్లాక్ రద్దయింది. అందుకే తాజా ఈ కోల్‌బ్లాక్‌ను తిరిగి తెలంగాణకు కేటాయించాల్సిన అవసరముంది. రాష్ట్రంలోని విద్యుత్తు ప్లాంట్లకు ఏటా 4.50 మిలియన్ టన్నుల బొగ్గు కొరతను తీర్చేందుకూ కొత్త కోల్‌బ్లాక్‌లను కేటాయించాలి. సింగరేణి కం పెనీ ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో నిర్మిస్తున్న 1,200 మెగావాట్ల కేంద్రానికి 6 మిలియన్ టన్నులు, అదనంగా నిర్మించే 600 మెగావాట్ల యూనిట్‌కు 3 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంది. వీటితోపాటు 4,200 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణానికి 21 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం. ఈ ప్రాజెక్టుల ప్రతి పాదనలన్నీ సిద్ధమయ్యాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా ఎన్‌టీపీసీ తెలంగాణలో 4,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేం ద్రాలను నెలకొల్పనుంది. రామగుండంలో ఇప్పుడున్న ప్లాంట్‌లోనూ 1,600 మెగావాట్ల యూనిట్లు, రెండోదశలో నల్లగొండ జిల్లా దామరచర్లలో 2,400 మెగావాట్ల ప్లాంట్‌ను స్థాపించనుంది. ఎన్‌టీపీసీ ప్లాంట్లకు 20 మిలి యన్ టన్నుల బొగ్గు అవసరం. గత ఏడాది జూన్ 7న, సెప్టెంబర్ 6న రాసిన లేఖల్లోనూ ఈ విషయాలను ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు.
 500 మెగావాట్ల విద్యుత్తు ఇవ్వండి
 తెలంగాణలో వచ్చే 4 నెలలు విద్యుత్తు కొరత  తీవ్రమయ్యే పరిస్థితి ఉన్నందున.. తూర్పు గ్రిడ్ నుంచి  500 మెగావాట్ల మిగులు విద్యుత్తు సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ ప్రధానికి మరో లేఖలో విన్నవించారు. ఏపీ, తెలంగాణ విద్యు త్తు వాటాల పంపిణీ వివాదంపై కేంద్ర ఇంధన శాఖ కమిటీ ఇప్పటికీ తుది నివేదిక ఇవ్వలేదని, దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. ఈ లేఖ ప్రతిని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రికి  కూడా పంపారు.   
 

మరిన్ని వార్తలు