ఇక యాదవ సిరులు

21 Jun, 2017 01:00 IST|Sakshi
ఇక యాదవ సిరులు

గొర్రెల పథకంతో గొల్ల, కురుమల వద్ద రూ.25 వేల కోట్ల సంపద: సీఎం కేసీఆర్‌
- రెండున్నరేళ్లలోనే సాధ్యం కాబోతోంది.. ఇది కేసీఆర్‌ మాట
- గొల్ల, కురుమలకు కోటిన్నర గొర్రెలు అందిస్తాం
- జీవాలకు రోగం వస్తే 1962కు ఫోన్‌ చేయండి..
- గొర్రె ఎరువుతో రైతులు సేంద్రియ సాగు చేయాలి
- ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.. కోటి ఎకరాలకు నీరిస్తాం..
- సిద్దిపేట జిల్లా కొండపాకలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి


సాక్షి, హైదరాబాద్‌: ‘‘నిండు మనసుతోటి కొమురెల్లి మల్లన్నకు దండంపెట్టి చెబుతున్న.. తెలంగాణ యాదవులు రెండున్నరేళ్లలో వందకు వందశాతం రూ.25 వేల కోట్ల సంపద సృష్టించబోతున్నారు. ఇది కేసీఆర్‌ మాట. త్వరలో దేశంలోనే అత్యంత ధనికులైన యాదవులు తెలంగాణలో ఉండబోతున్నారు. యాదవ సోదరులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. గ్రామీణ తెలంగాణను బలోపేతం చేసేలాగా.. గొర్రెల పథకాన్ని విజయవంతం చేయాలి.. కేసీఆర్‌ను గెలిపించాలి..’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. రోజుకు 650 గొర్రెలను దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఆరున్నర వేల గొర్రెలను ఎగుమతి చేసే పరిస్థితికి రావాలని అభిలషించారు.

ప్రస్తుతం గొర్రెల పెంపకందారుల వద్ద ఉన్న కోటి గొర్రెలకు మరో కోటిన్నర గొర్రెలు ఇస్తే రెండున్నరేళ్లలో అవి 7.5 కోట్లు అవుతాయన్నారు. అందులో రెండున్నర కోట్లు తమ వద్ద ఉంచుకొని ఐదు కోట్ల గొర్రెలను ఒక్కోదాన్ని రూ.5 వేలకు అమ్ముకున్నా గొల్ల, కుర్మల వద్ద రూ.25 వేల కోట్ల సంపద చేరుతుందన్నారు. గొర్రెల పెంపకంతో పెద్ద ఎత్తున గొర్రె ఎరువు వస్తుందని, దానితో రైతులు సేంద్రీయ వ్యవసాయం చేయాలని సూచించారు. రాష్ట్రానికి యాదవులు గొప్ప సంపద అని పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపాకలో సీఎం కేసీఆర్‌ ఒగ్గుడోలు మోగించి గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు.

825 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశారు. వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గొర్రెల స్టాళ్లను పరిశీలించారు. సభా వేదిక పైకి సీఎం చేరుకోగానే గొల్ల కురుమల సంప్రదాయ పద్ధతిలో రుమాలు, గొంగడితో యాదవ సంఘ ప్రతినిధులు ఆయన్ను సన్మానించారు. అనంతరం బందారానికి చెందిన బట్ట యాదగిరి, కోలుపుర ఐలయ్య, చింతం బాలమల్లులకు గొర్రెల పంపిణీలో భాగంగా ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన బీమా పత్రాలను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కుర్మలకు కోటిన్నర గొర్రెలు అందజేసేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పథకం కింద నాలుగు లక్షల కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయించినా.. 7.61 లక్షల దరఖాస్తులు వచ్చాయని, అందులో 7.18 లక్షల యూనిట్లు మంజూరు చేశామన్నారు. వీరికి రెండున్నరేళ్లలో కోటిన్నర గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పారు. కొండపాక గ్రామాభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. నాడు చెప్పిన మాట నేడు రుజువైంది.. తెలంగాణ సాధన కోసం బయల్దేరినప్పుడు చాలామంది అపహాస్యం చేశారు. తెలంగాణ ఎందుకు కావాలంటూ.. ఢిల్లీలో అనేక మంది మాజీ ప్రధానమంత్రులు, అప్పటి మన్మోహన్‌సింగ్, ఇతర కేంద్ర మంత్రులు నన్ను అడిగేవారు. తెలంగాణ ఎందుకు కావాలని కోరామో ఇప్పుడు చేసి చూపుతున్నం. నైజాం కాలంలో గణపురం ఆయకట్టు కింద 40 వేల ఎకరాల్లో పంట పండితే.. ఉమ్మడి పాలనలో అది 4 వేల ఎకరాలకు చేరింది. మళ్లీ తెలంగాణ వచ్చాక ఈ ఏడాది 40 వేల ఎకరాల్లో పంట పండించుకున్నం.

ఇందుకే తెలంగాణ సాధించుకున్నం. నా చిన్ననాడు రైతు వడ్ల కల్లం చేస్తుంటే ఎంతమంది అడుక్కునేవాళ్లు వచ్చినా ధైర్యంగా చాటెడు వట్లు పెట్టేవాడు. అట్లాంటి రైతు ఉమ్మడి రాష్ట్ర పాలనలో హైదరాబాద్, ముంబైకి వలస పోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఉద్యమ సమయంలోనే నేను ఎన్నో వేదికలపై చెప్పిన. తెలంగాణ ధనిక రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్‌లో కలిసి మేం ముగినిపోయినం అని చెప్పిన. ఆ వాదన నేడు రుజువైంది. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఆర్థిక ప్రగతిలో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. 2024 నాటికి రాష్ట్ర బడ్జెట్‌ రూ.5 లక్షలకు చేరుతుంది. ఇదీ మన ఆర్థిక ప్రగతి.

గొర్రెకు రోగం వస్తే 1962కు ఫోన్‌ చేయండి..
గొర్రెలకు జబ్బు చేస్తే మీరు ఇబ్బంది పడకుండా మందల దగ్గరికే డాక్టరు వస్తరు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంచార పశువైద్యశాలలు ఏర్పాటు చేస్తున్నం. జూలైలో వంద బస్సులు అందుబాటులోకి వస్తయి. ఏటా మూడుసార్లు నట్టల మందులు ఇస్తాం. ఇది కాకుండా గొర్రెలకు ఏదైనా రోగం వస్తే 1962 నంబర్‌కు ఫోన్‌ చేస్తే 108 మాదిరే అర్ధగంటలోపే అంబులెన్స్‌ వస్తుంది. అటవీ భూముల్లో గొర్రెలు మోపేందుకు అనుమతిచ్చాం.

మంచి పోషకాలు ఉన్న స్టైలో గడ్డిని పెంచుతున్నం. గుట్టలు, సాగుకు యోగ్యం కాని భూముల్లో తుమ్మచెట్టు పెంచుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్న. అలాగే పండ్ల తోటల్లో కూడా స్టైలో గడ్డి పెంచితే అటు గొర్రెలకు మేత దొరుకుతుంది. ఇటు పండ్ల తోటలకు గొర్రె ఎరువు వస్తుంది. ఇందుకు పండ్ల తోటల యజమానులు, గొర్రెల కాపరులను ఒప్పించేలా కలెక్టర్లు, స్థానిక నేతలు చొరవ తీసుకోవాలి.

అధైర్యపడకండి.. అండగా ఉంటాం..
రైతులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. మీకు బాధలు ఏవైనా ఉంటే చెప్పండి.. కానీ అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు. తెలంగాణలో రైతులు ధీమాగా ఉండాలి. ఒకప్పుడు నీళ్లు లేక ఎందరో రైతులు బోర్లు వేసి.. బోర్లపడి అప్పులపాలయ్యారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరెంటు పీడ శాశ్వతంగా పోయింది. వచ్చే యాసంగి నుంచి రైతులకు 24 గంటల కరెంటు ఇస్తాం. ప్రభుత్వమే ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి ఇస్తుంది. వచ్చే ఏడాది మే 15 వరకు తొలి విడత పంట పెట్టుబడి రైతు ఖాతాల్లో వేస్తాం. సకాలంలో పెట్టుబడి, నీళ్లు, కరెంటు ఇస్తే రైతుకు ఇంకేమీ అవసరం లేదు.

త్వరలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సంఘాలను ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర రైతు సమాఖ్య వద్ద రూ.500 కోట్ల మూలధనం ఉంచుతాం. రూ.ఐదారు వేల కోట్ల రుణం తీసుకునేలా ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. పంట ధరను వ్యాపారులతో మండల రైతు సమాఖ్య చర్చిస్తుంది. వారు గిట్టుబాటు ధరకు ఒప్పుకుంటే సరి.. లేకుంటే రాష్ట్ర రైతు సమాఖ్య ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి బియ్యం పట్టించి ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తుంది.

మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో ఇరిగేషన్‌ రంగంలో అద్భుతాలు జరుగుతున్నయి. రెండేళ్లలో అనేక ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. ఇప్పుడున్న సాగుభూమితోపాటు అన్ని జిల్లాల్లో కలిపి అదనంగా పది లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రయత్నం జరుగుతోంది. వచ్చే జూన్‌ తర్వాత గోదావరి జలాలు సిద్దిపేట జిల్లాను అభిషేకించబోతున్నాయి.

జయశంర్‌ సార్, నేను హెలికాప్టర్ల పోతుంటే ఏడ్చినం..
కాళేశ్వరం నీళ్లు, కృష్ణా నీళ్లు వచ్చి కోటి ఎకరాల్లో తెలంగాణ పచ్చబడతది. కోటి ఎకరాల తెలంగాణ సాధించి తీరుతం. ఉమ్మడి రాష్ట్రంలో నేను, జయశంకర్‌సార్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా మీది నుంచి హెలికాప్టర్ల పోతుంటే ఆ కరువును చూసి ఏడ్చినం. ఆ దుఃఖం ఇప్పుడు పోవాలె. కోటి ఎకరాలు పచ్చబడాలి. దాన్ని నేను హెలికాప్టర్‌లో చూడాలి. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బంగారు తెలంగాణ అయి తీరుతది. మాకు ఎవరూ బాస్‌లు, హైకమాండ్‌లు లేవు. తెలంగాణ ప్రజలే మాకు బాస్‌లు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని పరిపుష్టం చేస్తాం.

వాళ్లను నిలదీయండి..
ప్రాజెక్టులు కడుతుంటే కొందరు కోర్టులకు పోయి అడ్డుకునే చిల్లర రాజకీయాలు చేస్తున్నరు. వాళ్లెవరో మీకు తెలుసు. కేవలం 20 రోజుల్లో ఐదు కేసులు వేశారు. వాళ్లను ప్రజలు, రైతులు నిలదీయాలి. కేసులు వేసి ప్రాజెక్టులు ఎందుకు అడ్డుకుంటున్నరని అడగాలి. ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు కేసీఆర్‌ ఎవరికీ భయపడడు.

నాడు కన్నీరు.. నేడు పన్నీరు..: మంత్రి హరీశ్‌
గొర్రెల పంపిణీ పథకం దేశానికే గొప్ప దిక్సూచి కాబోతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. గతంలో పల్లె కన్నీరు పెడుతోంది అనేట్లు ఉన్న పరిస్థితి మారి.. ఇవాళ పల్లె పన్నీరు చల్లుతోందన్న స్థాయికి చేరుకున్నామని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు