పంట పండుతుంది

17 May, 2019 03:18 IST|Sakshi

కాళేశ్వరం పూర్తయితే సాగులోకి 90 లక్షల ఎకరాలు

తెలంగాణ వాతావరణంలో.. రైతుల జీవితాల్లో మార్పు 

ప్రాజెక్టు నిర్వహణ భారంపై కొందరివి అవగాహన రాహిత్య విమర్శలు 

‘కాళేశ్వరం’ విద్యుత్‌ అవసరాలపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ 

రెండేళ్లలోనే కాళేశ్వరం వ్యయానికి సమానమైన పంటలాభం 

ఏటా 540 నుంచి 600 టీఎంసీల గోదావరి జలాల తరలింపు 

ఈ ఏడాది రోజుకు 2 టీఎంసీల చొప్పున 6 నెలలపాటు ఎత్తిపోత 

వచ్చే ఏడాది 3 టీఎంసీల చొప్పున తరలింపు 

ఈ ఏడాది 3,800, వచ్చే ఏడాదికి 6,100 మెగావాట్ల విద్యుత్‌ అవసరం 

విద్యుత్‌ సరఫరా వ్యయ భారం ప్రభుత్వానిదేనని వెల్లడి 

మిగిలిన పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, నిర్వహణ భారంపై కొందరు వెలిబుచ్చే అభిప్రాయాలు పూర్తిగా అవగాహన రాహిత్యంతో కూడుకున్నవి. ఒక్కో ప్రాంతానికి అక్కడున్న పరిస్థితులను బట్టి వేర్వేరు ప్రాధాన్యతలుంటాయి. గల్ఫ్‌ దేశాల్లో మంచినీళ్లు దొరకవు. అక్కడి ప్రభుత్వాలు మంచినీళ్ల కోసమే ఎక్కువ ఖర్చుచేస్తాయి. లాస్‌వెగాస్‌కు మంచినీళ్లు ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం 600 కిలోమీటర్ల దూరం నీళ్లను పంప్‌ చేస్తోంది. తెలంగాణలో వ్యవసాయానికి సాగునీరు ఇవ్వడం ప్రాధాన్యతాంశం. రైతులను బతికించడానికి, వ్యవసాయం సాగడానికి సాగునీటి కోసం ఖర్చు చేస్తాం. ఒక్కసారి కాళేశ్వరం పూర్తయితే జనం బతికిపోతారు. ఏడాదికి 90 లక్షల ఎకరాల్లో పంట పండుతుంది.

ఏడాది రెండేళ్ళలోనే ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చుకు సమానమైన పంట పండుతుంది. రైతుల జీవితాలు మారుతాయి. తెలంగాణ వాతావరణం మారుతుంది’అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్‌ సరఫరాపై ముఖ్యమంత్రి గురువారం ప్రగతి భవన్‌లో విస్తృత సమీక్ష నిర్వహించారు. వచ్చే జూలై చివరి నుంచే కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన విద్యుత్‌ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోయడానికి 3,800 మెగావాట్లు, వచ్చే ఏడాది ఖరీఫ్‌ నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్టు చేయడానికి మొత్తం 6,100 మెగావాట్ల విద్యుత్‌ అవసరమన్నారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నిర్వహణకు మరో వెయ్యి మెగావాట్లు అవసరం అవుతుందన్నారు. కావాల్సినంత విద్యుత్‌ను సమకూర్చుకుని, గోదావరిలో నీటి ప్రవాహం ఉండే ఆరు నెలల పాటు నిర్విరామంగా 24 గంటల పాటు సరఫరా చేయాలన్నారు. ప్రతీ ఏడాది దాదాపు 540 నుంచి 600 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసి 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే నెల 10వ తేదీలోగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పంపుహౌజుల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. 
 
ఎత్తిపోతలకు అంతా సిద్ధం! 
‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీలు చొప్పున నీటిని లిఫ్టు చేయడానికి అవసరమైన నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. పంపుల ట్రయల్‌ రన్లు కూడా విజయవంతమయ్యాయి. ఈ ఏడాది జూలై నుంచే నీటిని ఎత్తిపోయాలి. గోదావరిలో తెలంగాణ వాటాను సంపూర్ణంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. నీటి లభ్యత కూడా మేడిగడ్డ వద్దే ఎక్కువగా ఉంది. కాబట్టి మేడిగడ్డ నుంచి మరో టీఎంసీని కూడా లిఫ్టు చేయాలని నిర్ణయించాం. వచ్చే ఏడాది నుంచి.. మేడిగడ్డ నుంచి 3 టీఎంసీల నీటిని లిఫ్టు చేస్తాం. గోదావరిలో నీటి ప్రవాహం ఉండే జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు నీటిని లిఫ్టు చేసే అవకాశం ఉంటుంది. జూన్, నవంబర్‌ మాసాల్లో రోజుకు 2 టీఎంసీల చొప్పున, జూలై నుంచి అక్టోబర్‌ వరకు నెలకు 3 టీఎంసీల చొప్పున నీరు లిఫ్టు చేయవచ్చు. డిసెంబర్‌లో కూడా ఒక లిఫ్టు నడిపి కొంత నీరు తీసుకోవచ్చు. ఏ నెలలో ఎంత నీరు తీసుకోవచ్చు, దీనికి ఎంత కరెంటు అవసరం పడుతుందో శాస్త్రీయంగా అంచనా వేయాలి. ఈ సమయంలో సరిపడినంత విద్యుత్‌ను సరఫరా చేయడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలి’అని కేసీఆర్‌ సూచించారు. 
 
తెలంగాణకు గోదారే దిక్కు ! 
’గోదావరిలో తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉంది. ఈ నీటిని వాడుకోవడానికి అన్ని రకాల అనుమతులున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం కూడా చేసుకున్నాము. 44ఏళ్ల సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం మేడిగడ్డ వద్ద పుష్కలమైన నీటి లభ్యత ఉంది. తెలంగాణ భూభాగంలో వ్యవసాయం, తాగు నీరు, పరిశ్రమలకు అవసరమైన 85% నీటిని గోదావరి నుంచే తీసుకోవాలి. గోదావరి నదిలో నీటి ప్రవాహం ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వీలైనంత ఎక్కువ మొత్తంలో నీటిని లిఫ్టు చేయాలి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మిడ్‌ మానేరుకు ఈ ఏడాది 2 టీఎంసీలు లిఫ్టు చేయాలి. రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఒక టీఎంసీని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు, మరో టీఎంసీని మల్లన్న సాగర్‌కు లిఫ్టు చేయాలి. వచ్చే ఏడాది ఎల్లంపల్లి వరకు 3 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్‌ వరకు 2 టీఎంసీల నీటిని తరలించి, రిజర్వాయర్లు, చెరువులను నింపాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతిపాదించిన 22 లక్షల ఎకరాలకు మాత్రమే కాకుండా, శ్రీరాం సాగర్‌ ఆయకట్టుకు, గుత్ప–అలీసాగర్‌ పథకాలకు, నిర్మల్, ముథోల్‌ నియోజకవర్గాలకు, గౌరవల్లి ద్వారా హుస్నాబాద్‌ నియోజకవర్గానికి నీరివ్వాలి. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు ఏడాదికి రెండు పంటలకు నీరందించాలి. ఏడాదికి 90 లక్షల ఎకరాల్లో పంటలు పండించాలి. కేవలం సాగునీరే కాకుండా మంచినీటికి, పరిశ్రమలకు కూడా కాళేశ్వరం ద్వారా నీరందించాలి’అని సీఎం స్పష్టం చేశారు. 
 
విద్యుత్‌ వ్యయ భారం ప్రభుత్వానిదే! 
ఎత్తిపోతల పథకాల పంపుసెట్ల నిర్వహణకు అవసరమైన విద్యుత్‌ను సమకూర్చాలని, దీనికయ్యే ఖర్చు కోసం రైతుల ఉచిత విద్యుత్‌ సబ్సిడీ మాదిరిగా ప్రభుత్వమే విద్యుత్‌ సంస్థలకు ప్రత్యేక గ్రాంటు ఇస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఎత్తిపోతల పథకాల కోసం నిర్మించిన సబ్‌ స్టేషన్లు, ఇతర విద్యుత్‌ సంబంధ వ్యవస్థల నిర్వహణ బాధ్యతను విద్యుత్‌ సంస్థలే చేపట్టాలన్నారు. ఎత్తిపోతల పథకాల ద్వారా జల విద్యుత్‌ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, ఎక్కడెక్కడ ఎంతెంత విద్యుదుత్పత్తి చేయవచ్చో శాస్త్రీయంగా సర్వే చేయించాలని ఆయన ఆదేశించారు.  
 
17వేల మెగావాట్లకు సిద్ధం: ట్రాన్స్‌కో సీఎండీ 
రాష్ట్రంలో 11వేల మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ ఏర్పడినప్పటికీ ఎక్కడా కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేశామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావు పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకాలకు మరో 6వేల మెగావాట్లు అవసరమైనా సమకూరుస్తామని, మొత్తం రాష్ట్ర డిమాండ్‌ 17వేల మెగావాట్లకు చేరినా, సరఫరాకు సిద్ధంగా ఉన్నామన్నారు. భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా విద్యుత్‌ ఉత్పత్తి కూడా పెరుగుతుందన్నారు. తెలంగాణకు ప్రస్తుతం 16,203 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉందని, ఈ ఏడాది చివరి నాటికి 1,080 మెగావాట్ల భద్రాద్రి ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని, కొద్ది నెలల్లోనే ఎన్టీపీసీ ప్లాంటు ద్వారా 1,600 మెగావాట్లు అందుతుందన్నారు. 4వేల మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా పవర్‌ ప్లాంటు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 28వేల మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా, 100% విద్యుత్‌ పంపిణీ చేయడానికి అనువైన సరఫరా వ్యవస్థను సిద్ధం చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్‌ సరఫరా చేయడానికి అవసరమైన వ్యవస్థలను శరవేగంగా పూర్తి చేశారని సీఎం కేసీఆర్‌ విద్యుత్‌ సంస్థలను అభినందించారు. గడువుకు ముందే పనులు పూర్తి చేశారని, సహజంగా ఇంత త్వరగా పనులు పూర్తి కావన్నారు. ఇదే స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 3 టిఎంసీల నీటిని లిఫ్టు చేయడానికి అవసరమైన అదనపు ఏర్పాట్లు కూడా వేగంగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. 
 
18న రామగుండంలో, 19న కాళేశ్వరంలో సీఎం పర్యటన 
సీఎం కేసీఆర్‌ ఈ నెల 18న రామగుండంలో, 19న కాళేశ్వరంలో పర్యటిస్తారు. 18న రామగుండంలో నిర్మాణంలో ఉన్న 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ పవర్‌ ప్లాంటును సందర్శిస్తారు. అక్కడే ఎన్టీపీసీ, జెన్‌కో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 19న ఉదయం కాళేశ్వరం దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలిస్తారు.  
 

మరిన్ని వార్తలు