పకడ్బందీగా పల్లె ప్రగతి.. 

27 Jan, 2020 01:23 IST|Sakshi

ఫొటోలకు పోజులివ్వడం మానండి 

మీ పనితీరు చూసేందుకు త్వరలో  గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటిస్తా 

పల్లె ప్రగతిపై ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌ వెల్లడి 

పల్లెలు, పట్టణాలు బాగుంటే అంతా బాగున్నట్టేనని వ్యాఖ్య 

గ్రామాల బాగు కోసం చేయాల్సిన పనులన్నీ చేయాలని స్పష్టీకరణ 

సాక్షి, హైదరాబాద్‌: గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియాలనే లక్ష్యంతో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం మరింత పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. ప్రతిరోజూ ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య పనులు జరగాలని, గ్రామాలు బాగుండటం కోసం రోజూ చేయాల్సిన పనులు చేసి తీరాల్సిందేనని స్పష్టంచేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం ఎలా అమలవుతోంది.. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ పరిధిలో విధులు ఎలా నిర్వహిస్తున్నారు అనే విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు త్వరలో తానే గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలు జరుపుతానని వెల్లడించారు. పల్లె ప్రగతి స్పూర్తితో త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించనున్నట్లు చెప్పారు. పల్లె ప్రగతి పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘‘ప్రజలు అయితే పల్లెల్లో, లేకుంటే పట్టణాల్లో నివసిస్తారు.

ఈ రెండు చోట్లు బాగుంటే అంతా బాగున్నట్టే. అందుకే పల్లెలు, పట్టణాలు బాగుండాలని ప్రభుత్వం సంకల్పించింది. ముందుగా పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టింది. పంచాయతీరాజ్‌ శాఖలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేశాం. ప్రతీ గ్రామానికి గ్రామ కార్యదర్శిని నియమించాం. పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాం. ప్రతినెలా క్రమం తప్పకుండా రూ.339 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నాం. ప్రతీ గ్రామానికి ట్రాక్టర్‌ సమకూరుస్తున్నాం. ప్రభుత్వం ఇన్ని రకాల సహకారం, ప్రేరణ అందిస్తున్నప్పటికీ పల్లెలు బాగుపడకుంటే ఎట్ల? కచ్చితంగా బాగుపడి తీరాలి. ప్రతీ గ్రామానికి నర్సరీ ఏర్పాటు చేశాం. విధిగా అన్నిచోట్లా మొక్కలు పెంచాలి. గ్రామాన్ని శుభ్రంగా ఉంచడానికి ప్రతిరోజూ వీధులు ఊడ్చాలి. మోరీలు శుభ్రం చేయాలి. కొన్ని రోజులు చేసి చేతులు దులుపుకోవడం కాదు. ప్రతిరోజూ గ్రామాల్లో ఏం జరగాలో అవన్నీ జరగాలి’’అని ఆదేశించారు. 

మొక్కుబడి వ్యవహారం వద్దు.. 
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొందరు మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తామే గ్రామాన్ని ఊడ్చినట్లు పేపర్లో ప్రచారం కోసం ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారని.. ఇది సరికాదని సీఎం పేర్కొన్నారు. ‘‘వారంతా ఉన్నది చీపురు పట్టి ఊడవడానికి కాదు. గ్రామాల్లో ఎవరి పని వారితో చేయించడానికి. గ్రామ పంచాయతీల్లో అవసరమైన సిబ్బందిని నియమించాం. వేతనాలు పెంచాం. ట్రాక్టర్లున్నాయి. వాటిని ఉపయోగించి, పని చేయించాలి. అంతే తప్ప మొక్కుబడి వ్యవహారం కావద్దు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పనులు ఎలా జరుగుతున్నాయి? పల్లె ప్రగతి పురోగతి ఏమిటి? ఎవరెవరు తమ బాధ్యతలు సరిగ్గా నిర్వహిస్తున్నారు? అనే విషయాలు పరిశీలించడానికి నేనే స్వయంగా త్వరలో గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తాను’’అని తెలిపారు.  

నగరాలు, పట్టణాలు కాలుష్యకూపాలుగా మారకూడదు 
హైదరాబాద్‌ నగరంతో పాటు, ఇతర నగరాలు, పట్టణాలు కాలుష్య కూపాలుగా మారకుండా పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. నగరాల లోపల, బయట ఉన్న అటవీ భూముల్లో విరివిగా చెట్లు పెంచి, దట్టమైన అడవులు ఉండేలా చూడాలన్నారు. ‘‘హైదరాబాద్‌ శరవేగంగా విస్తరిస్తోంది. నగరంలో జనాభా అంతకంతకూ పెరుగుతోంది. మనది సముద్ర తీరం లేని నగరం. కాలుష్యం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిర్లక్ష్యం చేస్తే ఇతర నగరాల మాదిరిగా జనజీవనం నరకప్రాయం అవుతుంది. దీనికి విరుగుడుగా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలి. హైదరాబాద్‌ లోపల, బయట లక్షా 60 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. అక్కడ విరివిగా చెట్లు పెంచి దట్టమైన అడవులుగా తీర్చిదిద్దాలి. దీనివల్ల హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు, కాలుష్యం పెరగకుండా చూడవచ్చు. నగరంలో కూడా విరివిగా చెట్లు పెంచాలి. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ బడ్జెట్లలో పదిశాతం నిధులను పచ్చదనం పెంచడానికి ఉపయోగించాలి.

ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా హరిత ప్రణాళిక రూపొందించాలి. అన్ని పట్టణాల్లో కనీసం వార్డుకొకటి చొప్పున నర్సరీలు ఏర్పాటు చేయాలి. తెలంగాణలోని అన్ని పట్టణాలు పచ్చదనంతో కళకళలాడే విధంగా పట్టణ ప్రగతిలో చర్యలు ప్రారంభించాలి’’అని ముఖ్యమంత్రి కోరారు. ఈ సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ తివారి, పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ రఘునందనరావు, పీసీసీఎఫ్‌ శోభ, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు.  

ఇదీ పల్లె ప్రగతి పురోగతి నివేదిక 
 –   12,751 గ్రామాలకు గాను 12,705 గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు  
–    ఇప్పటి వరకు 6,017 ట్రాక్టర్ల కొనుగోలు. మరో 4,534 ట్రాక్టర్లకు ఆర్డర్‌ 
–    ఇప్పటి వరకు గ్రామాల్లో 10.78 కోట్ల మొక్కలు నాటగా.. వాటిలో 84 శాతం మొక్కలు బతికాయి 
–    76,562 కిలోమీటర్ల మేర వీధుల శుభ్రం 
–    62,976 కిలోమీటర్ల మేర మురికి కాల్వల శుభ్రం 
–    48,767 చోట్ల ఇళ్ల శిథిలాల తొలగింపు 
–    1,24,655 చోట్ల పొదలు, తుప్పలు, మురికి తుమ్మల తొలగింపు 
–    56,213 చోట్ల ఖాళీ ప్రదేశాలు, కామన్‌ ఏరియాల శుభ్రం 
–    9,954 పాత, పనిచేయని బోర్ల మూసివేత 
–    1,13,881 చోట్ల నీరు నిల్వ ఉండే బొందల పూడ్చివేత 
–    56,050 చోట్ల రోడ్ల గుంతలను పూడ్చివేత 
–    67,245 చోట్ల ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల శుభ్రం 
–    మార్కెట్లు, సంతలు నిర్వహించే 6,500 ప్రదేశాల శుభ్రం 

హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు 350కి పెంపు  
హైదరాబాద్లో పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న బస్తీ దవాఖానాల సంఖ్యను 350కి పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రస్తుతం ఉన్న 118 బస్తీ దవాఖానాలు బాగా పనిచేస్తున్నాయని, ప్రజలు వీటితో ఎంతో సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో వీటి సంఖ్యను గణనీయంగా పెంచాలని సూచించారు. నగరంలోని 150 డివిజన్లలో డివిజన్‌కు రెండు చొప్పున ఈ దవాఖానాలు ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, పేదలు నివసించే బస్తీలు, కాలనీల్లో మరిన్ని ఎక్కువ ఏర్పాటు చేయాలన్నారు. నెలరోజుల్లోనే కొత్త బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  

మరిన్ని వార్తలు