ఆర్టీసీపై నేడు సీఎం సమీక్ష 

23 Nov, 2019 02:33 IST|Sakshi

రూట్ల ప్రైవేటీకరణ, కార్మికులను విధుల్లో చేర్చుకునే అంశాలపై చర్చ! 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ఈ సందర్భంగా సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఆర్టీసీకి ఉన్న అప్పులు, బకాయిలు తదితరాలపై గురువారం సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో సంస్థను నడపాలంటే ప్రతినెలా రూ.

640 కోట్లు అవసరమవుతాయని అంచనాకు వచ్చిన విషయం తెలిసిందే. శనివారం జరిగే సమీక్షలో రూట్ల ప్రైవేటీకరణ విధివిధానాలపై ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రూట్ల ప్రైవేటీకరణకు వీలుగా ప్రైవేటు బస్సులకు పర్మిట్ల జారీకి టెండర్లు పిలవడంపై ఈ సందర్భంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బేషరతుగా విధుల్లో చేర్చుకుంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో.. ఈ అంశం కూడా చర్చకు వస్తుందని భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు