విభజన చట్టం మేరకే...

15 Sep, 2017 00:55 IST|Sakshi
విభజన చట్టం మేరకే...

ఆర్టీసీ విభజనపై కేసీఆర్‌
వివాదం కూడదన్న ముఖ్యమంత్రి
ఏపీతో స్నేహపూర్వకంగానే ఉంటాం
కాదంటే కేంద్రమే చూసుకుంటుంది
ఆర్టీసీ బోర్డు ప్రతినిధులకు స్పష్టీకరణ
నేటి విజయవాడ భేటీలో ఇదే చెప్పాలని ఆదేశం


సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఆర్టీసీ ఆస్తుల విభజనకు విభజన చట్టంలో పేర్కొన్న విధానాన్నే అనుసరించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా జరగిన విభజన పద్ధతులనే ఆర్టీసీ ఆస్తులకూ వర్తింపజేయాలి’’అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ విభజన ఒక వాస్తవం. ఈ వాస్తవాన్ని ముందు అంతా అంగీకరించాలి. రెండు రాష్ట్రాలకు సంబంధించి విజ్ఞతతో ఎవరి పాలన వారు చేసుకోవాలి. ఎవరి సంస్థలు వారు నడుపుకోవాలి. విభజన నేప థ్యంలోనే ఏపీఎస్‌ఆర్టీసీ విభజన కూడా జరుగుతోంది. కాబట్టి రాష్ట్ర విభజనకు వర్తించిన నిబంధనలే దానికీ వర్తిస్తాయి. పార్లమెంటు చట్టానికి లోబడే పంపకాలు జరుగుతాయి. ఈ విషయమై ఆర్టీసీ బోర్డు చేతిలో ఎలాంటి అధికారమూ లేదు’’అని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ ఆస్తుల విభజనపై ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటిదాకా సయోధ్య కుద రని విషయం తెలిసిందే. ఆగస్టులో జరిగిన ఆర్టీసీ బోర్డు భేటీలో రెండు రాష్ట్రాల ప్రతినిధులు విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్ర హోం శాఖ ఇటీవలి నిర్వచనం ప్రకారం బస్‌భవన్‌ను మాత్రమే ఉమ్మడి ఆస్తిగా పరిగణించాల్సి ఉంది.

బోర్డు భేటీ లో రాష్ట్ర ప్రతినిధులు ఇదే అభిప్రాయం చెప్పగా ఏపీ అధికారులు ససేమిరా అన్నారు. ఆర్టీసీ విభజనపై శుక్రవారం మరోసారి భేటీ జరగనున్న నేపథ్యంలో బోర్డు సభ్యులైన ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్‌శర్మ, ఆర్టీసీ ఎండీ రమణా రావులతో పాటు మంత్రి మహేందర్‌రెడ్డి బుధ వారం సీఎంతో భేటీ అయ్యారు. విభజనపై కేంద్రం జారీ చేసిన స్పష్టమైన విధి విధానాల ప్రకారమే ఆర్టీసీ విభజన ఉంటుందని సీఎం తెలిపారు. ‘‘ఇరుగుపొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలనే రాష్ట్ర మౌలిక విధానానికి అనుగుణంగా ఏపీతో విభజన సమస్యలను పరిష్కరించుకుందాం.

 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు అమలు చేసిన నిబంధనలనే ఏపీ విభజనకూ అనుసరించా రు. సమస్యలు తలెత్తితే రెండు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలి. కాని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకుంటుంది. అయినా  పరిష్కా రం కాకుంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయి. ఏ వివాదమైనా అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు చేసిన విభజన చట్టం మేరకే పరిష్కారమవాలి’’అని అన్నారు. ఇదే వైఖరిని విజయవాడ సమావేశంలో వెల్లడించాలని సూచించారు.

ఏపీకి ఇవ్వాల్సింది రూ.8 కోట్లే
కేంద్ర హోం శాఖ ఆదేశాలమేరకు బస్‌భవన్‌ విలువను మాత్రమే రెండు రాష్ట్రాల మధ్య పంచుకోవాల్సి ఉంది.  ఏపీ మాత్రం 14 ఆస్తులు ఉమ్మడిగా ఉంటాయని, వాటిని జనాభా దామాషా ప్రాతిపదికన పంచాల్సిందేనని వాదిస్తోంది. వీటిలో 13 ఆస్తులు రాష్ట్రంలో ఉన్నాయి. మిగ తాది ఏపీలోని ప్రకాశం జిల్లా రామ్‌గిరిలోని పవన విద్యుత్తు ప్లాంటు. ఇవన్నీ ఉమ్మడి జాబి తాలోకి రావని తెలంగాణ చెబుతోంది. ‘‘బస్‌భవన్‌ మాత్రమే ఉమ్మడి ఆస్తి. అందులోనూ ఆ భూమి నిజాం ప్రభుత్వం ఇచ్చింది గనుక దాని పై ఏపీకి హక్కుండదు.

 విభజన విషయంలో భవనం పుస్తక విలువను మాత్రమే పరిగణనలో కి తీసుకుంటే ఏపీ వాటా రూ.8 కోట్లు తేలుతుంది’’అని ఇటీవలి భేటీలో తెలంగాణ తెలిపింది. ఉమ్మడి ఆర్టీసీ మొత్తాన్ని యూనిట్‌గా చేసుకుని లాభనష్టాలను లెక్కించి దాన్ని జనాభా దామాషాలో కేటాయించాలన్న ఏపీ వాదనను ఖండించింది. ఏ ప్రాంత నష్టాలు ఆ రాష్ట్రానివేనని 2014 మేలో విభజనకు నెల ముందు జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానం జరిగిందని విజ యవాడ భేటీలో అధికారులు గుర్తు చేశారు. శుక్రవారం కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తామని రమణారావు ‘సాక్షి’తో చెప్పారు.

మరిన్ని వార్తలు