యాదాద్రి పునరుద్ధరణ పూర్తయ్యాక.. మహాయాగం

5 Feb, 2019 01:46 IST|Sakshi
సోమవారం యాదాద్రి నిర్మాణ పనులపై ప్రగతి భవన్‌లో సమీక్ష జరుపుతున్న సీఎం కేసీఆర్‌

సహస్రాష్టక మహాకుండ యాగం నిర్వహణ 

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులకు ఆహ్వానం

భారతీయులందరూ సందర్శించాలనుకునేలా మందిర నిర్మాణం

యాదాద్రి నిర్మాణంపై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పునరుద్ధరణ.. ప్రతి అంగుళంలో వైభవం

వెల్లూరు, తంజావూరు, అక్షరధామ్‌ ఆలయాల అధ్యయనం

ఒక్కోటిగా కాకుండా.. అన్ని పనులు సమాంతరంగా జరగాల్సిందే

గుట్ట కిందే బస్టాండు.. తుర్కపల్లి నుంచి నాలుగు లేన్ల రోడ్డు  

సాక్షి, హైదరాబాద్‌: ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయ పునరుద్ధరణ పనులు జరగాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశించారు. యాదాద్రిలో చేపట్టిన నిర్మాణ పనులకు నిధుల కొరత లేకుండా ఈసారి బడ్జెట్‌లో కూడా తగినన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తర్వాత సహస్రాష్టక మహాకుండయాగం (1008 యాగ కుండాలతో) 11 రోజుల పాటు నిర్వహిస్తామని, ఈ యాగానికి భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను ఆహ్వానిస్తామని ఆయన వెల్లడించారు. వందల ఏళ్ల పాటు నిలిచిపోయే దేవా లయ సన్నిధిలో ప్రతీ అంగుళం నిర్మాణంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, వైభవోపేతంగా నిర్మాణం జరగాలని సీఎం సూచించారు. అత్యాధునికంగా, ఆధ్మాత్మిక శోభ కనిపించేలా నిర్మించిన వెల్లూరు, తంజావూరు, అక్షర్‌ధామ్‌ లాంటి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించి నిర్మాణాలను అధ్యయనం చేయాలని ఆయన అధికారులను కోరారు. భారతీయులు తమ జీవితంలో ఒకసారైనా యాదాద్రిని సందర్శించాలనే ఆసక్తి కలిగేలా దేవాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని ఆయన అన్నారు.

పునరుద్ధరణ తర్వాత యాదాద్రికి భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతుందని.. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శివరాత్రి ఉత్సవాలు, తెప్పోత్సవం నిర్వహించడానికి, నిరంతరం వ్రతాలు చేసుకోవడానికి, తలనీలాల సమర్పణకు, మండల దీక్ష భక్తులు ప్రత్యేక పూజలు చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన చేయాలన్నారు. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా నిర్మాణ పనులన్నీ సమాంతరంగా సాగాలని, దీనికోసం ఏ పనికి ఆ పనిగా ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేయాలని కేసీఆర్‌ చెప్పారు. యాదాద్రి పునరుద్ధరణ పనులను ఆదివారం సందర్శించి వచ్చిన సీఎం.. సోమవారం ప్రగతిభవన్‌లో విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీలు గణపతి రెడ్డి, రవీందర్‌ రావు, ఈఈ వసంత్‌ నాయక్, ఎస్‌ఈ లింగారెడ్డి, వైటీడీఏ స్పెషల్‌ ఆఫీసర్‌ కిషన్‌ రావు, ఈవో గీత, ఆలయ నిర్మాణ నిపుణుడు ఆనంద్‌ సాయి, స్ట్రక్చర్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వర్లు, ఆర్కిటెక్ట్‌ మధుసూదన్, వాసుకి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా ప్రధాన ఆలయమున్న గుట్టపై ఎలాంటి నిర్మాణాలు రావాలి? గుట్ట కింద భాగంలో ఎలాంటి నిర్మాణాలు రావాలి? టెంపుల్‌ సిటీపై ఎలాంటి నిర్మాణాలు రావాలి? మొత్తంగా యాదాద్రి ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చించి సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకున్నారు. మాడవీధులు, ప్రాకారాలు కలుపుకుని 4.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయం నిర్మించాలని, మొత్తం 302 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయ ప్రాంగణం ఉంటుందని సీఎం వెల్లడించారు. 
 
బస్వాపూర్‌ చెరువు టు గండిచెరువు 
లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉండే గుట్ట పైభాగంలో ప్రధాన దేవాలయంతో పాటు గోపురాలు, ప్రాకారాలు, మాడ వీధులు, శివాలయం, ఆంజనేయస్వామి విగ్రహం, ఈవో కార్యాలయం, వీవీఐపీ గెస్ట్‌హౌజ్‌ (ప్రెసిడెన్షియల్‌ సూట్‌), అర్చక నిలయం, నైవేద్య వంటశాల, ప్రసాద మంటపం, రథశాల, వ్రత మంటపం, స్వామి పుష్కరిణి, క్యూ కాంప్లెక్స్, మెట్ల దారి, బస్టాప్, పోలీస్‌ ఔట్‌ పోస్టు, హెల్త్‌ సెంటర్లుండాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఏ నిర్మాణం ఎక్కడ రావాలనే దానిపై తుది నిర్ణయం తీసుకున్న ఆయన దీని ప్రకారం నిర్మాణాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. గుట్ట కింది భాగంలో గండి చెరువును తెప్పోత్సవం నిర్వహించడానికి అనువుగా సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు. బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి నిత్యం ఈ చెరువుకు నీటి సరఫరా చేస్తామని వెల్లడించారు. గండి చెరువుకు అనుబంధంగా కోనేరు, కళ్యాణకట్ట నిర్మించాలని చెప్పారు. గుట్ట కింద భాగంలోనే ఆలయ బస్టాండ్‌ నిర్మించాలని, అక్కడి నుంచి భక్తులను దేవాలయ వాహనాల ద్వారా గుట్టపైకి తీసుకు రావాలని చెప్పారు.

గుట్టపైకి వెళ్లి, రావడానికి వేర్వేరు దారులు ఉపయోగించాలని, గుట్ట కింద మండల దీక్ష చేపట్టిన భక్తుల కోసం ఆశ్రమం నిర్మించాలని నిర్ణయించారు. యాదాద్రి ఆలయం చుట్టూ రింగు రోడ్డు నిర్మించాలని, దానికి అనుబంధంగా రేడియల్‌ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, యాదాద్రి నుంచి తుర్కపల్లికి ఫోర్‌లేన్‌ రోడ్డు వేయాలని ఆదేశించారు. నిర్మాణ పనులన్నీ అత్యంత పటిష్టంగా జరగాలని, నాణ్యత విషయంలో రాజీపడవద్దని సీఎం స్పష్టం చేశారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తర్వాత పరిపూర్ణ ఉపాసకులతో అతిపెద్ద యాగం నిర్వహిస్తామని, దీనికి దేశ విదేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానిస్తామని వెల్లడించారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ యాగం కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయడానికి ఓ కమిటీని నియమించనున్నట్టు చెప్పారు. భక్తుల బస కోసం టెంపుల్‌సిటీలో 340 క్వార్టర్ల నిర్మాణ పనులు వేగంగా జరగాలని, టెంపుల్‌ సిటీలో రోడ్లు, మంచినీరు, విద్యుత్, డ్రైనేజి లాంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. యాదాద్రిలోని ప్రతీ బ్లాకుకు దేవుళ్లు, దేవతల పేర్లు పెడతామని చెప్పిన సీఎం యాదాద్రి టెంపుల్‌ సిటీ అంతా ప్రకృతి రమణీయత గోచరించేలా, ఆహ్లాదం వెల్లివిరిసేలా ఉద్యానవనాలు, ఫౌంటేన్లు నిర్మించాలని సూచించారు. 

మరిన్ని వార్తలు