రాజీవ్ రహదారిలో ఇన్ని లోపాలా?

22 Jul, 2014 02:02 IST|Sakshi

 ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్షలో కేసీఆర్ ఆగ్రహం
 ఆదిలాబాద్ హైవే తరహాలో తీర్చిదిద్దాలని ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: శాస్త్రీయత లేకుండా నాలుగులేన్లుగా విస్తరణ, పెరిగిన వాహన ప్రమాదాలు, తీవ్రఅవినీతి.. తదితర ఆరోపణలు మూటగట్టుకున్న రాజీవ్హ్రదారిపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులతో సోమవారం ఆయన సమీక్షించి లోపాలను సరిదిద్దాలని ఆదేశించారు.  దీనిపై నివేదికను అందజేయాలన్నారు.  హైదరాబాద్ నుంచి రామగుండం వరకు విస్తరించిన ఈ హైవే ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. కానీ విస్తరణ శాస్త్రీయంగా లేకపోవడమేగాక లోపభూయిష్టంగా ఉండడంతో వాహనదారుల పాలిట ఇది ప్రమాదకారిగా మారింది. విస్తరణ సమయంలోనే వివాదం తలెత్తడంతో అప్పటి సర్కార్ శాసనమండలి సభ్యులతో ఓ సభాసంఘాన్ని నియమించింది. నిర్మాణంలో లోపాలు నిజమేనంటూ ఆ కమిటీ నివేదిక సమర్పించినా చర్యలు తీసుకోలేదు. ఆ ఫైలునే అధికారులు మాయం చేశారు. వీటిన్నింటిని తీవ్రంగా పరిగణించిన సీఎం కేసీఆర్ ఆ లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు.
 
 బై-పాస్‌లు.. క్రాసింగ్‌లు : సాధారణంగా నాలుగులేన్ల రహదారికి సర్వీసు రోడ్లు  ఉండాలి. కానీ రాజీవ్ రహదారిపై అవి లేవు. దీనిపై కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రూ.1400 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డుపై గ్రామాల వద్ద బై-పాస్‌లు నిర్మించకపోవడాన్ని ఆయన అధికారులను ప్రశ్నిం చారు. వేగంగావచ్చే వాహనాలకు ప్రమాదాలు జరుగుతాయనే ఆలోచన కూడా ఉండదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని వెంటనే హైదరాబాద్- ఆదిలాబాద్ హైవే తరహాలో తీర్చిదిద్దాల్సిందేనన్నారు. ప్రతి గ్రామం వద్ద బై-పాస్‌లు, పెద్ద గ్రామాలున్నచోట వంతెనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భూసేకరణ చేయకపోవడం వల్ల బై-పాస్‌లను ఏర్పాటు చేయలేకపోయామని అధికారులు పేర్కొనగా, ఈసారి అది  పూర్తిచేసి వాటి ని నిర్మించాలని సూచించారు.
 
 ఆరు ప్రాంతాలు ప్రమాదకరమైనవిగా గుర్తింపు
 
 ప్రజ్ఞాపూర్, కుకునూర్‌పల్లి, దుద్దెడ, సుల్తానాబాద్, పెద్దపల్లి, రామగుండంలను  ప్రమాదకరంగా ఉన్న ఆరు ప్రాంతాలుగా గుర్తించిన అధికారులు అక్కడ బై-పాస్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అయితే, అవి చాలవని, మరోసారి రోడ్డుమొత్తాన్ని తనిఖీ చేసి కచ్చితమైన లోపాలు గుర్తించి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. అలాగే నగరంలోని ప్యాట్నీ నుంచి తూంకుంట వరకు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని ఆదేశించారు.
 

మరిన్ని వార్తలు