ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం: కేసీఆర్‌

8 Mar, 2020 02:46 IST|Sakshi

ఏపీ తరహాలో అమలుకు నిర్ణయం

మండలిలో సీఎం కేసీఆర్‌ ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మాధ్యమం అమలుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ సర్కారును అనుసరించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం చంద్రశేఖరరావు చెప్పారు. శాసనమండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం జరిగిన చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియాన్ని ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇంగ్లిష్‌ మీడియంలో తన కొడుకును చదివించడానికి ప్రైవేట్‌ పాఠశాలకు పంపుతున్న విషయాన్ని ఓ మహిళా కూలీ చెప్పడాన్ని టీవీలో చూశానన్నారు.

పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్‌ వచ్చి ఉండాలని అందరూ కోరుకుంటున్నారని, దీన్ని అమలు చేసేందుకు విద్యావేత్తలు తగిన ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌ సమావేశాల తరువాత దీనిపై ఓ సమావేశం ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. ఆ సమావేశానికి తాను కూడా హాజరవుతానని, ఆ మీటింగ్‌లో వ్యక్తమైన సలహాలు, సూచనల్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా జీవిత ఖైదీలను కొందరిని విడుదల చేయాలన్న విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా