వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టాలి: కేసీఆర్‌

17 Jun, 2018 13:17 IST|Sakshi

రాష్ట్రాలకు పన్ను రాయితీలు ఇవ్వాలి

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి

నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేసీఆర్‌

న్యూఢిల్లీ : వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నాలుగో సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ భూ రికార్డుల ప్రక్షాళన, నీటి ప్రాజెక్టుల అంశాలను,  రైతుల సంక్షేమం కోసం‌ తీసుకుంటున్న చర్యలు ఇలా మొత్తం 7 అంశాలను ప్రస్తావించారు. 

50 లక్షల రైతులకు మేలు..
రైతుబంధు పథకం కింద ఎకరానికి 4 వేల రూపాయలను రైతులకు అందజేసామని తెలిపారు. తెలంగాణలో 98 శాతం మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారని, వీరికి మేలు జరిగేలా రైతు బీమా పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టామన్నారు. ఈ పథకం ద్వారా 18 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్న రైతులందరికీ ఎల్‌ఐసీ బీమా అందజేస్తున్నామని పేర్కొన్నారు. రైతు మరణిస్తే తక్షణమే రూ. 5 లక్షలు బీమా అందేలే ఈ పథకం రూపొందించామని, రైతులకు దాదాపు రూ.1000 కోట్ల ప్రీమియం చెల్లిస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా 50 లక్షల రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. 50 లక్షల రైతులకు పట్టదారు పాస్‌ పుస్తకాలు అందజేసామన్నారు. నగరంలో ఉన్న ఆస్తులకు కూడా ఇదే తరహా పద్దతి అవలంభిస్తామని తెలిపారు. 

పన్ను రాయితీ..
వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు పన్ను రాయితీలు ఇవ్వాలని కోరారు. డైరీలు, కోళ్ల పరిశ్రమ, మత్సపరిశ్రమ, గొర్రెల, మేకల పంపకాల్లో ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. నీటి పారుదల రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నామని, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త జీవం వస్తుందన్నారు. రూ.1050 కోట్లతో మూడు ఏళ్లలో 356 వ్యవసాయ గోదాములు నిర్మించామని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరారు. పాలకమండలి చైర్మన్‌గా ఉన్న ప్రధాని సహా మండలి సభ్యులైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కానీ గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.

మరిన్ని వార్తలు