4, 5నెలల్లో.. నిరుద్యోగ భృతి

26 Feb, 2019 02:52 IST|Sakshi

విధివిధానాలపై కసరత్తు మొదలు.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌

త్వరలో పెండింగ్‌ భూరికార్డుల సర్వే ప్రారంభం

నేనెవరికీ భయపడను.. మరింత కఠినంగా ఉంటా

ఏడాదిలో ఇంకా సరళంగా కొత్త పహానీలు

బీడీ కార్మికుల పీఎఫ్‌కు కొత్త కటాఫ్‌ తేదీ

సాక్షి. హైదరాబాద్‌: నాలుగైదు నెలల్లో నిరుద్యోగభృతి పథకాన్ని అమల్లోకి తెస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన విధివిధానాల కూర్పుపై కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం శాసనసభలో సీఎం సుదీర్ఘంగా ప్రసంగించారు. ‘మేం పక్క రాష్ట్రం లాగా.. చివరి వరకు పెండింగు పెట్టి ఆ తర్వాత హడావుడి చేయం. అసలు నిరుద్యోగులు అంటే ఎవరనే దానిపై స్పష్టత రావాలి. దానికి కటాఫ్‌ డేట్‌ అవసరం. వచ్చే నాలుగైదు నెలల్లో వీటిపై స్పష్టత తెచ్చి పథకాన్ని ప్రారంభిస్తాం’అని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల వేల నిరుద్యోగభృతిని రాజకీయం కోసం కాంగ్రెస్‌ వాడుకునే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. (మనసా, వాచా, కర్మేణా..  బంగారు తెలంగాణకు పునరంకితం )

భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించి పెండింగులో ఉన్నవాటిని కూడా పూర్తి చేసేందుకు సర్వే ప్రారంభిస్తామన్నారు. ఈ విషయంలో కేంద్రం నుంచి కూడా కొంత సాయం తీసుకుంటామని కేసీఆర్‌ తెలిపారు. అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించి భూముల కొలతలు. హద్దుల్లో తేడా లేకుండా తేల్చి ఏడాదిలో మరింత సరళీకృత పహానీలు సిద్ధం చేస్తామని చెప్పారు. ఆ కసరత్తు పూర్తి చేసి కంక్లూజివ్‌ టైటిల్స్‌ జారీ చేస్తామని, దీనికి కొంత సమయం పట్టనున్నా.. ఆరేడు నెలల్లో సంబంధిత వెబ్‌సైట్‌ ప్రారంభిస్తామని చెప్పారు. పోడు భూముల రక్షణకు సంబంధించి కూడా సమగ్ర చర్యలు చేపడతామని. అటవీ భూముల పరిరక్షణ, గిరిజనుల భూములపై హక్కు కల్పించేలా కటాఫ్‌ డేట్‌ ఖరారు చేసి నిర్ధారించబోతున్నామని. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత వచ్చే జూన్‌లో ఈ కసరత్తు చేపడతామని సీఎం ప్రకటించారు. బీడీ కార్మికుల పీఎఫ్‌కు సంబంధించి కొత్త కటాఫ్‌ డేట్‌ ప్రకటించి అమలు చేస్తామన్నారు. (చంద్రబాబు కూడా మోసం చేశారు: ఎర్రబెల్లి) 

నేనెందుకు భయపడాలి?
పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతుపై జరుగుతున్న వివాదంపై సీఎం మండిపడ్డారు. ‘ఏ ఎన్నిక జరిగినా ఆ సమయంలో ఓట్ల గల్లంతుపై వివాదం నెలకొంటోంది. అటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఐఏఎస్‌ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. అలాంటప్పుడు ఓటర్ల జాబితాలో గందరగోళం ఎందుకు నెలకొంటోంది? నాకిప్పుడు 66 ఏళ్లు. ఈ దఫా పూర్తయ్యేసరికి 71 ఏళ్లొస్తాయి. ఈ వయసులో నేనెవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? నా దృష్టంతా జనరంజక పాలన మీదే. అందుకే ఇక పాలనలో పెను మార్పులు చూడబోతున్నారు. ఏ విషయంలోనైనా రాజీలేకుండా, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాను. అన్ని విభాగాలను సంస్కరిస్తా. కొన్ని విషయాల్లో మొహమాటం లేకుండా కఠినంగా వ్యవహరిస్తా. మొన్నటి ఎన్నికల సమయంలో మాతోపాటు కాంగ్రెస్‌ కూడా ఎన్నో హామీలిచ్చింది. మాపై ఎన్నో ఆరోపణలుచేసింది. చివరకు ఏమైంది. కాంగ్రెస్‌నేతలు చెప్పింది తప్పు. మేం చెప్పింది నిజం అని తేలింది కదా’అని సీఎం అన్నారు.
 
‘పీఎం కిసాన్‌’అదనమే!
దేశం మొత్తానికి మార్గదర్శకంగా మారిన రైతుబంధు అమలులో కచ్చితంగా వ్యవహరిస్తామని సీఎం పేర్కొన్నారు. కేంద్రం కొత్తగా ప్రారంభించిన ‘పీఎం కిసాన్‌’తో దీన్ని కలపబోమని వెల్లడించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధును ఎకరాకు రూ.10 వేలకు పెంచింది. ఇది పూర్తిగా రాష్ట్రప్రభుత్వమే అందిస్తుంది. ఇందులో కిసాన్‌ పీఎంను జోడించం. ఆ నిధులు రైతులకు అదనమే!’అని అన్నారు. నిమ్జ్‌ కోసం ఇప్పటికే 2,377 ఎకరాలు సేకరించినట్లు తెలిపిన సీఎం.. మిగిలిన భూ–సేకరణ కూడా జరుపుతామని, యూపీఏ చివరి దశలో కేటాయించిన ఐటీఐఆర్‌ విషయంలో కేంద్రంతో పోరాడుతున్నామన్నారు. దీని ప్రభావం లేకుండా ప్రత్యామ్నాయ చర్యలతో ఐటీ ఎగుమతులు భారీగా పెంచామని సీఎం పేర్కొన్నారు. బుద్వేల్, కోకాపేట, కొల్లూరుల్లో ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేశామని. ఇప్పుడు ఐటీ ఎగుమతులు లక్ష కోట్ల రూపాయలను దాటాయని వెల్లడించారు. ‘ఇమేజ్‌ టవర్‌’పేరుతో బ్రహ్మాండంగా గేమింగ్‌ సెంటర్‌ ఏర్పాటవుతోందని. ఏడాదిన్నరలో టీ–హబ్‌–2 వస్తుందని చెప్పారు. ఎయిమ్స్‌ కోసం 200 ఎకరాలు కేటాయించామని పేర్కొన్నారు.  
 
బీసీలపై వారికి కపటప్రేమ
పంచాయితీరాజ్‌ చట్టం ఆర్డినెన్స్‌ విషయంపై కూడా సీఎం స్పష్టతనిచ్చారు. బీసీ రిజర్వేషన్లు 50%కు మించొద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం చెప్పటం. గడువులోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించటం.. నేపథ్యంలో ఆర్డినెన్స్‌ తెచ్చామని పేర్కొన్నారు. బీసీలకు రాజ్యాధికారం విషయంలో కాంగ్రెస్‌ కపటప్రేమ చూపిస్తోందని.. ఎన్టీఆర్‌ రిజర్వేషన్లు అమలుచేసిన తర్వాత వాటిని 50%కు చేర్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి బీసీ గురుకులాలు 19 మాత్రమే ఉండేవని. ఇప్పుడవి 280కి చేరుకున్నాయని. త్వరలో మరో 119 ప్రారంభమవుతాయని చెప్పారు. ‘సీఎల్పీ నేత మాట్లాడుతుండటంతో ప్రభుత్వానికి మంచి సూచనలు అందుతాయని ఆశించాను.
కానీ ఒక్కటంటే ఒక్క నిర్మాణాత్మక సూచన కూడా ఇవ్వకపోగా. సభను తప్పుదారి పట్టించేలా వ్యవహరించారు. బడ్జెట్‌ లెక్కలపై భట్టి విక్రమార్క చెప్పిన విషయాలు తప్పు. విద్య కోసం ప్రతిపాదించిన నిధులు 6% మాత్రమేనని.. ఆయన చెప్పటం సరికాదు. అది దాదాపుగా 11.2%గా ఉంది’అని సీఎం పేర్కొన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు మళ్లిస్తున్నారన్నది కూడా అబద్ధమని. ప్రతిపాదించినదానికంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్టు సభ దృష్టికి తెచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు కాగితాలకే పరిమితం కాగా. రికార్డు సమయంలోనే తమ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా దూసుకెళ్తోందన్నారు. మిషన్‌ కాకతీయ కింద 22 వేల చెరువులను బాగు చేసుకున్నామని. రూ.4 వేల కోట్లతో ఫీడర్‌ ఛానళ్లు. చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తున్నామని కేసీఆర్‌ వెల్లడించారు.  

మరిన్ని వార్తలు