లబ్ధిదారులే మనకు బలం

22 Oct, 2018 11:04 IST|Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ‘మనం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఒక్కో నియోజకవర్గంలో సుమారు 60 వేల మంది వరకు లబ్ధి పొందారు. వాళ్ల వివరాలు మీకు ఇస్తున్నా. వీళ్లే మన బలం.. జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయండి, గెలుపు మనదే’ అని గులాబీ దళపతి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులకు వివరించినట్లు తెలిసింది. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారి వివరాలతో కూడిన జాబితాను నియోజకవర్గాలవారీగా అభ్యర్థులకు కేసీఆర్‌ అందజేశారు.

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్‌ కిట్, రూ.లక్ష రుణమాఫీ, రైతుబంధు, ఆసరా పింఛన్లు, ఎస్సీ, ఎస్టీలకు అభివృద్ధి పథకాలు, సీఎం రిలీఫ్‌ ఫండ్, గొర్రెల పథకం, చేప పిల్లల పంపిణీ పథకాల లబ్ధిపొందినవారు ప్రతి నియోజకవర్గంలో 60 మంది వరకు ఉన్నారని. వీళ్లంతా ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారని, ప్రతి లబ్ధిదారుడి కుటుంబంలో కనీసం ముగ్గురు చొప్పున ఓటర్లను వేసుకున్న 1.80 ఓట్లు వస్తాయని, మన గెలుపునకు ఈ ఓట్లు చాలని, అభ్యర్థులు అవసరమైతే  వ్యక్తిగతంగా కానీ, దిగువ శ్రేణి నాయకత్వం ద్వారా వాళ్ల ఇళ్లకు వెళ్లి కలవాలని కేసీఆర్‌ గెలుపు మంత్రం సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వరంగల్‌ జిల్లాలో ఒకటి, రెండు చోట్ల మాత్రమే అసమ్మతి ఉందని, మిగతా వాళ్లంతా  దారికి వచ్చారని పార్టీ నిర్ణయం మేరకు పని చేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తారని కేసీఆర్‌ వరంగల్‌ జిల్లా పార్టీ అభ్యర్థులకు సూచించినట్లు  తెలిసింది.

త్వరలోనే వరంగల్‌లో భారీ బహిరంగ సభకు వస్తానని, ఈ నెల చివరి వారంలోగా బహిరంగ సభ తేదీని ఖరారు చేయాలని తాజా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఆదేశించినట్లు సమాచారం. పూర్తి స్థాయి మేనిఫెస్టోలో మరెన్నో ప్రజాకర్షక హామీలు ఉంటాయని, ఈ లోపు  ప్రజలు ఆదరించేలా మినీ మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం సాగాలని సూచించారు. ప్రజల్లో ఉన్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించినట్లు తెలిసింది. కోడ్‌ అమలులో ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని, ప్రచారంపై నిర్లక్ష్యం చూపవద్దని ఆదేశించినట్లు సమాచారం. కాగా ఎన్నికల నిర్వహణలో జిల్లా నుంచి కడియం శ్రీహరికి కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది.

సోమవారం ప్రకటిస్తాం : కడియం శ్రీహరి 
త్వరలోనే వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామని, బహిరంగ సభల తేదీలను సోమవారం ప్రకటిస్తామని ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విలేకరుల సమావేశంలో ప్రకటించారు. మహాకూటమిని తాము పోటీగా భావించడం లేదని కడియం వ్యాఖ్యానించారు. 

24 లేదా 25న తొర్రూరులో భారీ బహిరంగ సభ 
ఇదిలా ఉండగా ఈ నెల 24 లేదా 25వ తేదీల్లో తొర్రూరు పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు స్థానిక తాజామాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆదివారం పట్టణ శివారులో సభా స్థలాన్ని ఆయ న పరిశీలించారు. కేసీఆర్‌ హాజరయ్యే ఈ సభకు భారీగా జనసమీకరణ చేసేందుకు ఇప్పటికే పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

మరిన్ని వార్తలు