కేసీఆర్‌ పథకాలను బాబు కాపీ కొడుతున్నారు

24 Jan, 2019 02:41 IST|Sakshi

చంద్రబాబు చేసే పనుల్లోచిత్తశుద్ధి ఉండదు

ఆంధ్రా ప్రజలు తెలివైనవారు..బాబును నమ్మే స్థితిలో లేరు

ఇంకా భావజాల ఆధిపత్యాన్నిప్రదర్శిస్తున్న మీడియా సంస్థలు

టీఆర్‌ఎస్‌ పార్టీవర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను ఏపీ సీఎం చంద్రబాబు కాపీ కొడుతున్నారని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శిం చారు. కేసీఆర్‌ చేసినవన్నీ తాను కూడా చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుస్తాననే భ్రమలో బాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. బాబు చేసే పనుల్లో చిత్తశుద్ధి ఉండదన్నారు. ఏపీ ప్రజలు, అక్కడి జర్నలిస్టులు తెలివైనవారు, చైతన్యవంతులని చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా అక్కడి ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెలిపారు. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో బుధవారం తెలంగాణ యూని యన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ సంస్థ ఆధ్వర్యం లో జరిగిన ఆంథోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అభినందన సత్కార సభకు కేటీఆర్‌ ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు.

రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు అవుతున్నా కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ఇంకా ఆ భావజాల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్నారు. ఇలాంటి ధోరణి మానుకోవాలని సూచించారు. తాను ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ కొన్ని పత్రికలు చూస్తే అందులో తెలంగాణ వార్తలు ఉండవని, తెలంగాణలో ఒక ప్రభుత్వం ఉన్నట్లుగానీ, ఒక ముఖ్యమంత్రి ఉన్నట్లుగానీ వార్తలు కనిపించవని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను అక్కడున్న ఓ వ్యక్తిని అడిగితే.. అది ఆంధ్రా ఎడిషన్‌ అని చెప్పిండని, మరి ఆంధ్ర ఎడిషన్‌లో తెలంగాణ వార్తలు రాయనప్పుడు తెలంగాణ ఎడిషన్‌లో ఆంధ్రా వార్తలు ఎందుకని నిలదీశారు.

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు
న్యాయపరమైన చిక్కులు, వివాదాలు రాకుండా రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని కేటీఆర్‌ తెలిపారు. అలాగే హెల్త్‌కార్డులను కూడా అందిస్తామన్నారు. జర్నలిస్టులను సంస్థాగతంగా గౌరవించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఓ సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల భవనానికి స్థలం కేటాయిం చేందుకు సీఎంతో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తామని అన్నారు.

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ... జర్నలిస్టులు ఎవరూ అధైర్యపడవద్దని, దశలవారీగా సమస్యలను పరిష్కరించుకుందామని భరోసా ఇచ్చారు. మీడియా అకాడమీ భవనాన్ని అత్యాధునికంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. భవన నిర్మాణ భూమి పూజకు హాజరు కావాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణిలతో పాటుగా పలువురు సంపాదకులు, తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ సంఘం నేతలు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు