బోధన్‌ ఎన్నికల ప్రచార సభలోనైనా..

26 Nov, 2018 16:54 IST|Sakshi
నిజాంషుగర్స్‌ రక్షణ కమిటీ కన్వీనర్‌ రాఘవులు, పాల్గొన్న ప్రతినిధులు

నిజాంషుగర్స్‌ భవితవ్యంపై కేసీఆర్‌ స్పష్టత ఇవ్వాలి

 నిజాంషుగర్స్‌ రక్షణ కమిటీ డిమాండ్‌

సాక్షి, బోధన్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్‌ సభకు వస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజాంషుగర్స్‌ భవితవ్యంపై స్పష్టత ఇవ్వాలని నిజాంషుగర్స్‌ రక్షణ కమిటీ సభ్యులు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని రాకాసీపేట్‌ ప్రాంతంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిజాంషుగర్స్‌ రక్షణ కమిటీ కన్వీనర్‌ రాఘవులు, ప్రతినిధులు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చకుండా ఏ ముఖంతో ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ప్రశ్నించారు.

బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ తెలంగాణ వారసత్వ సంపద, ఈ ప్రాంత అస్తిత్వం అవునా? కాదా? ప్రత్యేక రాష్ట్రసాధనోద్యమంలో షుగర్‌ ఫ్యాక్టరీ సమస్యను చోదక శక్తిగా ఉపయోగించుకున్నారా? లేదో? జవాబు చెప్పాలన్నారు. షుగర్‌ ఫ్యాక్టరీని ప్రైవేట్‌ కంపెనీ కబంధ హస్తాల నుంచి  విడిపించి, ప్రభుత్వపరం చేసుకోకుండా, ఇచ్చిన హామీని నెరవేర్చలేక, నడిచే ఫ్యాక్టరీని మూసివేసి కేసీఆర్‌ నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఆంధ్రప్రాంత ప్రైవేట్‌ షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యాల లాబీయింగ్‌ ప్రభావంతో ఈ ప్రాంత షుగర్‌ ఫ్యాక్టరీలను మూసివేశారని ఆరోపించారు. ఫ్యాక్టరీ మూసివేతతో వందలాది మంది చెరుకు రైతులు ఇబ్బందులపాలయ్యారని, ఉపాధి కోల్పోయి ఫ్యాక్టరీ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. 

ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయంలో చిత్తశుద్ధి చూపకపోవడం దుర్మార్గ వైఖరికి నిదర్శనమని కెసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, స్వాధీనం అంశంపై స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నిజాంషుగర్స్‌ రక్షణ కమిటీ ప్రతినిధులు గంగాధర్‌ అప్ప, వరదయ్య, మల్లేష్, షేక్‌బాబు, శంకర్‌ గౌడ్, యేశాల గంగాధర్, ఎండీ గౌస్, సుల్తాన్‌ సాయిలు, ఎన్‌డీఎస్‌ఎల్‌ మజ్దూర్‌  యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రవి, శంకర్‌గౌడ్, ప్రతినిధి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు