మైనారిటీ యువతకు నజరానా

24 Oct, 2017 02:00 IST|Sakshi

వంద శాతం సబ్సిడీపై రూ.2.5 లక్షల ఆర్థిక సాయం: సీఎం కేసీఆర్‌

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో మైనారిటీలకు 10 శాతం కోటా

కోకాపేటలో ఇంటర్నేషనల్‌ ఇస్లామిక్‌ కల్చరల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌

హైదరాబాద్‌లో ముస్లింలకు ప్రత్యేక ఇండస్ట్రియల్‌ ఎస్టేట్, ఐటీ కారిడార్‌

గోల్డెన్‌ టెంపుల్‌ తరహాలో చార్మినార్‌ను అభివృద్ధి

పాతబస్తీలో మంచినీటి పైపులైన్ల మరమ్మతులకు రూ.41.70 కోట్లు

మైనారిటీల సంక్షేమంపై సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: మైనారిటీ యువకుల స్వయం ఉపాధికి బ్యాంకులతో సంబంధం లేకుండా వంద శాతం సబ్సిడీపై ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.2.5 లక్షల విలువైన యూనిట్లకు ఈ ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూ చించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల్లో మైనారిటీలు కనీసం పది శాతం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మైనారిటీల సంక్షేమంపై సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మం త్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎంఐఎం శాసనసభాపక్ష నాయ కుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్, మైనారిటీ శాఖ కార్యదర్శి ఉమర్‌ జలీల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ దానకిషోర్, హైదరాబాద్‌ కలెక్టర్‌ యోగిత, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘‘ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కచ్చితంగా మైనారిటీలు లబ్ధి పొందేలా కార్యాచర ణ ఉండాలి. అర్బన్, సెమీ అర్బన్, కార్పొరేషన్లు, గ్రామీణ ప్రాంతాల్లో మైనారిటీల అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. వాటికి అనుగుణంగానే కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలి’’అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అన్ని వర్గాల అభివృద్ధితోనే సంపూర్ణ ప్రగతి
‘‘ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే రాష్ట్రంలో మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో ముస్లింలే ఎక్కువ. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే మైనారిటీల్లో అత్యంత పేదరికం ఉంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే మైనారిటీల జీవితంలో వెలుగు వస్తుందని ఉద్యమ సమయంలోనే నేనెన్నో సార్లు చెప్పాను. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో కేటాయింపులు పెంచాం. చాలా కొత్త కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీల నిధులు ఎలా ఖర్చు చేస్తున్నామో మైనారిటీల కోసం పెట్టే ఖర్చును కూడా అలాగే ఖర్చు చేయాలి. తెలంగాణలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఏ ఒక్క వర్గం వెనుకబడిపోయినా అది సంపూర్ణ ప్రగతి కాదు’’అని సీఎం అన్నారు. కాగా, సమీక్ష ముగిసిన వెంటనే సీఎం ఆదేశాల మేరకు పాత బస్తీకి రూ.41.70 కోట్లు విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది నియోజకవర్గాల్లో తాగునీటి పైపులైన్ల మరమ్మతులకు ఈ నిధులు విడుదల చేసింది.

సీఎంకు జామీయా నిజామియా కృతజ్ఞతలు
జామీయా నిజామియా విద్యాలయం నుంచి ఇచ్చే డిగ్రీ సర్టిఫికెట్లకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వడానికి అంగీకరించిన ముఖ్యమంత్రికి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. ఎమ్మెల్యే పాషా ఖాద్రి, వొలేమా కమిటీ చైర్మన్‌ బాద్షా ఖాద్రి, చాన్స్‌లర్‌ అక్బర్‌ నిజాముద్దీన్, వైస్‌ చాన్స్‌లర్‌ ముఫ్తీ ఖలీల్‌ తదితరులు సీఎంను కలిశారు.  

రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఓ విప్లవం: అసదుద్దీన్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు సామాజిక మార్పుకు ఎంతగానో దోహదపడుతున్నాయని, పదేళ్లలో ఓ విప్లవం చూస్తామని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. సమీక్షలో పాల్గొన్న అసదుద్దీన్‌ సీఎంతో ప్రత్యేకంగా మాట్లా డారు. చాలామంది ముస్లింలు తమ పిల్లలను రెసిడెన్షియల్‌ స్కూళ్లల్లో చేర్పించడాని కి ఆసక్తి చూపుతున్నారన్నారు. బోధన, వసతి, ఆహారం బాగున్నాయని ప్రశంసించారు. మైనారిటీ సంక్షేమం కోసం అన్ని ర కాల వ్యయాల కన్నా, రెసిడెన్షియల్‌ స్కూళ్ల కోసం పెట్టే ఖర్చు తనకు సంతృప్తినిస్తోం దని సీఎం పేర్కొన్నారు. రేపటి తరానికి మంచి విద్యను అందించడం కన్నా మించి న ఆస్తి ఏదీ లేదన్నారు. సెక్షన్లు పెంచమని, అదనపు స్కూళ్లు కావాలని ఎమ్మెల్యేల నుంచి డిమాండ్‌ వస్తోందని చెప్పారు.

గోల్డెన్‌ టెంపుల్‌ తరహాలో చార్మినార్‌
చార్మినార్‌ను గోల్డెన్‌ టెంపుల్‌ తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం పేర్కొన్నారు. ‘‘దేశంలోనే చార్మినార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులంతా చార్మినార్‌ చూడాలనుకుంటారు. ఇందుకు తగినట్లుగా చార్మినార్‌ వద్ద ఏర్పాట్లుండాలి. చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలి. పర్యాటకులు చార్మినార్‌ వద్ద హాయిగా గడిపేలా ఏర్పాట్లు చేయాలి. అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌ తరహాలో చార్మినార్‌ను అభివృద్ధి చేయాలి. 42 కిలోమీటర్ల మూసీ పరీవాహక ప్రాంతా న్ని సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ తరహాలో అభివృద్ధి చేయాలి. పార్కులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లతోపాటు పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలి. మూసీ నది వెంట మెట్రోరైలు/ నానో రైలు నడపడానికి ఏర్పాట్లు చేయాలి. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ పనుల ను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించాలి. హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వివిధ అత్యవసర పనులకు ఎస్‌డీఎఫ్‌ నుంచి రూ.40 కోట్లు వెంటనే విడుదల చేయాలి’’అని అన్నారు.

ముస్లింలకు ప్రత్యేక ఐటీ కారిడార్‌
హైదరాబాద్‌లో ముస్లింలకు ప్రత్యేక ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ (పారిశ్రామిక వాడ), ప్రత్యేక ఐటీ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ‘‘కోకాపేటలో పది ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఇస్లామిక్‌ కల్చ రల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలి. 3 వారాల్లో నిర్మాణ పనులు ప్రారంభించాలి. పాఠశాలలు, కళాశాలల్లో ఉర్దూ టీచర్ల పోస్టు లెన్ని, ఖాళీలెన్ని? వంటి వివరాలు సేకరించి భర్తీ చేయాలి. మైనారిటీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ, వక్ఫ్‌ బోర్డు సమర్థంగా పనిచేయడానికి చర్యలు తీసుకో వాలి. పోటీ పరీక్షలు, వివిధ కోర్సుల ప్రవేశాలకు చేపట్టే ఎంట్రన్స్‌లు ఉర్దూ భాషలో కూడా నిర్వహించాలి’’అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు