భక్తులకు అసౌకర్యం కలిగించొద్దు

27 Jan, 2020 04:26 IST|Sakshi

మేడారం జాతర సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి జాతరను విజయవంతంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించా రు. ప్రభుత్వ సీఎస్, డీజీపీ, ఇతర సీనియర్‌ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించడానికి, మేడారం వెళ్లిరావడానికి ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచుతామన్నా రు. మేడారం జాతర ఆహ్వాన పత్రికను మంత్రు లు ఆదివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌కు అందించారు.

మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్ర బెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ మాలోత్‌ కవిత తదితరులు కేసీఆర్‌ని కలిసి మేడారం జాతరకు ఆహ్వానించారు. మంత్రులు, ప్రభుత్వ సీఎస్‌ సోమేశ్‌ కుమార్, ఇతర అధికారులతో మేడారం జాతర ఏర్పాట్లను సీఎం సమీక్షించారు. ‘‘మేడారం జాతరకు భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. మంచినీరు, పారిశుధ్యం తదితర విషయాల్లో ఏమరపాటు మంచిది కాదు. క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ తదితర అంశాల్లో సరైన వ్యూహం అనుసరించాలి. గతంలో వరంగల్‌ జిల్లాల్లో పనిచేసి, మేడారం జాతర నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను అక్కడికి పంపాలి. అన్ని శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో వ్యవహరించి జాతరను పూర్తి చేయాలి’’అని సీఎం అధికారులను ఆదేశించారు. కాగా, మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం  ఫిబ్రవరి 2 నుంచి ఆర్టీసీ 4 వేల బస్సులు నడపనుంది.

మరిన్ని వార్తలు