త్వరలో సింగరేణికొస్తా..

9 Oct, 2017 01:49 IST|Sakshi

మీ సమస్యలు తెలుసుకునేందుకు యాత్ర చేస్తా

సింగరేణి కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణిలో పరిస్థితులు చక్కదిద్దాల్సిన అవసరం ఉందని.. ఇందుకోసం త్వరలో సింగరేణి యాత్ర చేపడతానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తద్వారా కార్మికుల సమస్యలను తెలుసుకుంటానన్నారు. ఆదివారం ప్రగతి భవన్‌లో సింగరేణి కార్మికులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్‌ మాట్లాడారు.

‘‘గోదావరిఖని అయినా... ఎక్కడికైనా నేనే వస్తా. మీ సమస్యలు ఏమిటో తెలుసుకుంటా. మీరు చూపించుకుంటున్న ఆస్పత్రిలోనే బీపీ చెక్‌ చేయించుకుంటా’’ అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆరు భూగర్భ గనులు ప్రారంభమైతే 6–7 వేల మందికి ఉద్యోగాలు దక్కుతాయన్నారు. కార్మికుల క్వార్టర్లకు ఏసీ పెట్టుకునే అవకాశం కల్పిస్తామని, అందుకు ఉచితంగా కరెంట్‌ ఇస్తామని స్పష్టం చేశారు. క్యాంటీన్లలో ఏయే పదార్థాలు బాగుంటాయో లిస్ట్‌ తయారు చేసుకోవాలని సీఎం సూచించారు.

10 లక్షల వరకు వడ్డీలేని గృహ రుణం..
సింగరేణి కార్మికుల గృహ నిర్మాణాలకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణం ఇస్తామని సీఎం వెల్లడించారు. సింగరేణిలో ప్రభుత్వ వాటాలో అధిక భాగాన్ని సింగరేణి కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేస్తామన్నారు. సింగరేణి నుంచి ప్రభుత్వానికి వచ్చే వాటా నుంచి రూ. 50 కోట్లు తగ్గించుకోనైనా రూ. 10 లక్షల రుణం ఇస్తామన్నారు.

ఆధునికంగా సింగరేణి ఆస్పత్రులు
సింగరేణి ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కార్మికుల తల్లిదండ్రులూ రిఫరల్‌ హాస్పిటల్స్‌లో వైద్య సేవలు పొందేలా చర్యలు చేపడతామన్నారు. ఇప్పుడున్న మెడికల్‌ బోర్డు కార్మికుల రక్తం తాగుతోందని, ఇకపై టీబీజీకేఎస్‌ ఆఫీసుకు వెళ్తే ఒక్క నిమిషంలో పని అయ్యేటట్లు చేస్తానన్నారు. అలియాస్‌ పేర్లతో ఉద్యోగాలు చేస్తున్న వారందరినీ సొంత పేర్లకు మారుస్తామన్నారు.

అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని సింగరేణిలో ఆ రోజు అధికారిక సెలవు దినంగా పాటిద్దామన్నారు. ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నతస్థాయి విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన కార్మికుల పిల్లల ఫీజును సింగరేణి కంపెనీ పూర్తిస్థాయిలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘టీబీజీకేఎస్‌ గెలించింది 2012లో.. ఆ తర్వాతే తెలంగాణ రాష్ట్రం.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాయి. ఈసారి గెలుపు సింగరేణి కార్మికుల గెలుపు కావాలి’’అని సీఎం ఆకాంక్షించారు.

టీబీజీకేఎస్‌ గుర్తింపు సంఘానికి సభ్యత్వ రుసుమును ఇక నుంచి ఒక్క రూపాయే ఇవ్వాలని సూచించారు. సింగరేణికి రూ. 750 నుంచి రూ. 800 కోట్ల లాభం వచ్చిందని, కొత్త పే రివిజన్‌ ప్రకారం పెరిగిన వేతనాలు ఇవ్వడానికి రూ. 375 కోట్లు పక్కన పెడతామన్నారు. ‘‘సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగం అనుకున్నంత మంచిది కాదు. సింగరేణి కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తారు. బయ్యారం ఉక్కు గనిని కూడా సింగరేణికే అప్పగిస్తాం. ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో సీనియర్లకు అవకాశం కల్పిస్తాం’’అని సీఎం పేర్కొన్నారు.


లంచం అడిగితే చెప్పుతో కొట్టండి
‘‘సింగరేణిలో లంచాల బెడదను పూర్తిగా రూపుమాపాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం క్వార్టర్‌ మారి నా లంచం ఇవ్వాలి. జ్వరం వచ్చినా లంచం ఇవ్వాలి. అసలు కార్మికులు లంచం ఎందుకు ఇవ్వాలి? రేపటి నుంచి లంచం అడిగినోడిని...తీసుకున్నోడిని చెప్పుతో కొట్టండి. ఇప్పటి వరకు కార్మిక సంఘం నేతలు బాగుపడ్డారు కానీ కార్మికులు మాత్రం అలాగే ఉన్నారు. ఇకపై ఈ పరిస్థితి మారాలి’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు