చెప్పిందొకటి.. చేసిందొకటి..!

24 Apr, 2019 02:05 IST|Sakshi

భూరికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ శాఖ తప్పటడుగులు

తొలుత మాన్యువల్‌ చేయాలని సీఎం సూచన

అది పట్టించుకోకుండా ముందే ఆన్‌లైన్‌ మొదలు

ఎడిట్‌ ఆప్షన్‌ లేకుండా ఎడాపెడా నమోదు

ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందుబాటులో లేని మాన్యువల్‌ పహాణీలు

సాక్షి, హైదరాబాద్‌: భూరికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ అధికారులు అత్యుత్సాహంతో ఆది లోనే తప్పటడుగు వేసినట్లు ఆలస్యంగా నిర్ధారణ అవుతోంది. రికార్డుల పరిశీలన, సవరణల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ చేసిన సూచనలకు భిన్నంగా రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరు అనర్థాలకు కారణమైందని చర్చ జరుగుతోంది. భూరికార్డులన్నింటినీ పరిశీలిం చి మాన్యువల్‌ (చేతిరాత) పహాణీలు తయారు చేయాలని, ఆ ప్రక్రియ పూర్తయ్యాక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేసి సమీకృత విధానాన్ని తీసుకొద్దామని సీఎం కేసీఆర్‌ చెప్పగా.. రెవెన్యూ యంత్రాంగం మ్యాన్యువల్‌ (కొన్నిచోట్ల), ఆన్‌లైన్‌ ప్రక్రియలను సమాంతరంగా చేపట్టిన కారణంగానే సమస్యలు వస్తున్నాయని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నా యి. ఆన్‌లైన్‌ చేసే క్రమంలో కూడా ఎడాపెడా నమోదు చేయడం, ఎడిట్‌ ఆప్షన్‌ కూడా లేని ప్రత్యేక పోర్టల్‌లో వీటిని నమోదు చేయడంతో పాటు మాన్యువల్‌ పహాణీల తయారీ ప్రక్రియ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో చేయకపోవడంతో భూరికార్డుల ప్రక్షాళనలో దొర్లిన పొరపాట్లను సవరించడం కష్టసాధ్యంగా మారింది.

సీఎం చెప్పారిలా..
రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాందిపలకాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా రెవెన్యూ శాఖలో సంస్కరణలపై ఉన్నతాధికారులతో కమిటీ వేశారు. ఈ కమిటీలో చర్చించి భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. రికార్డుల ప్రక్షాళనలో అనుసరించాల్సిన విధివిధానాలపై సీఎం కేసీఆర్‌ స్పష్టతనిచ్చారు. క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించి వాటిని మాన్యువల్‌ పహాణీలో నమోదు చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఆ రికార్డును ఆన్‌లైన్‌లో పొందుపరుద్దామని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా రికార్డుల అప్‌డేషన్‌కు అనుగుణంగా కొత్త సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మరోసారి భూ రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేసే అవకాశముండదని స్పష్టం చేశారు. ఈ రికార్డులను బ్యాంకులు, రిజిస్ట్రేషన్ల శాఖతో అనుసంధానం చేస్తామని తెలిపారు.

అధికారులు చేశారిలా..
సీఎం చెప్పినట్లు కాకుండా భూ రికార్డులను ఏకంగా మాన్యువల్‌తో పాటు ఆన్‌లైన్‌లో రెవెన్యూ అ«ధికారులు నమోదు చేశారు. ప్రభుత్వ పెద్దలతో చర్చించకుండానే అప్పటివరకు ఉన్న వెబ్‌ల్యాండ్‌ స్థానంలో ‘టీ–ల్యాండ్‌’పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. రికార్డుల ప్రక్షాళన పురోగతిని తెలుసుకుంటామనే పేరుతో ఎప్పటికప్పుడు సరిచేసిన రికార్డులను ఆ పోర్టల్‌లో నమోదు చేసి లెక్కలు ప్రభుత్వానికి చూపెట్టారు. పోనీ అదైనా సంపూర్ణంగా ఉందంటే అదీ లేదు. ఈ పోర్టల్‌ కూడా సాంకేతికంగా సరిగా లేకపోవడంతో ఆదిలోనే ఆనేక అవాంతరాలు ఎదురయ్యాయి. దీనికితోడు పనిభారం, రైతుబంధు పంపిణీ పేరిట గడువు నిర్దేశించడం, గ్రామ స్థాయిలోని వీఆర్‌వోలకు ఈ పోర్టల్‌పై సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో తప్పులు దొర్లాయి. ఈ తప్పులను సరిదిద్దు కోవడానికి ఎడిట్‌ ఆప్షన్‌ లేకుండా పోర్టల్‌ను రూపొందించారు. దీంతో భూ రికార్డుల ప్రక్షాళన గందరగోళంగా మారింది. పాత రికార్డులను యథాతథంగా రికార్డులకెక్కించిన రెవెన్యూగణం.. వాటిని మొదట మాన్యువల్‌ పహాణీలో నమోదు చేయాలనే అంశాన్ని పక్కనపెట్టింది. కొన్నిచోట్ల మాన్యువల్‌ పహాణీలు పూర్తి చేసినా చాలా గ్రామాల్లో సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేషన్‌ అనంతరం మాన్యువల్‌ పహాణీలు రూపొందించారు.

సాఫ్ట్‌వేర్‌ ఇవ్వలేదు కదా!
భూ రికార్డుల ప్రక్షాళనపై ఉన్నతాధికారులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయిన సమావేశంలో ‘టీ–ల్యాండ్‌’ప్రస్తావన వచ్చింది. ఈ ల్యాండ్‌ ఎక్కడిది.. ఇంకా సాఫ్ట్‌వేర్‌ ఇవ్వలేదు కదా అని సీఎం అనడంతో నాలుక్కరుచుకున్న ఉన్నతాధికారులు.. అది సాఫ్ట్‌వేర్‌ కాదని, రికార్డులను కంప్యూటరీకరిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత టీ–ల్యాండ్‌ స్థానంలోనే ‘ధరణి’వెబ్‌సైట్‌ను రెవెన్యూ శాఖ అందుబాటులోకి తెచ్చింది. అయితే భూ రికార్డుల అప్‌డేషన్‌ సమయంలో దొర్లిన తప్పులు సవరించేందుకు ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వకపోవడం, కొన్ని కేసులు ఆర్డీవో, జేసీలు మాత్రమే పరిష్కరించే వీలుండటంతో తీవ్ర కాలయాపన జరిగింది. ఇది కాస్తా ప్రజల్లో అనేక అపోహలకు దారితీసింది. రెవెన్యూ విభాగం ప్రతిష్ట మసకబారింది. రికార్డుల ప్రక్షాళనలో ఉన్నతాధికారులు సరైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడం, కిందిస్థాయి సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం ఈ సమస్యలకు దారితీసింది. 

>
మరిన్ని వార్తలు