కేసీఆర్ పాలన మోసపూరితం

5 Jul, 2014 01:23 IST|Sakshi

మందమర్రి/మంచిర్యాల టౌన్ :  ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత పాలన సాగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పింఛన్ల పెంపు కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు శుక్రవారం మందమర్రి, మంచిర్యాలలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

మంద కృష్ణమాదిగ శిబిరాలను సందర్శించి వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో దళితుడినే తొలి ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించి మోసం చేశాడని ఆరోపించారు. రుణమాఫీపై గందరగోళం సృష్టించి రైతులను, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటూ విద్యార్థులను, పింఛన్ పెంచుతామంటూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులను మోసగించాడని అన్నారు.

 తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నా పింఛన్ల పెంపు విషయమై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. దీనిని నిరసిస్తూ వారం రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. పింఛన్ల పెంపు అమలు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి చిప్పకుర్తి వెంకన్న, నాయకుడు జూపాక సాయి, తూర్పు జిల్లా అధ్యక్షుడు కల్వల శరత్, నాయకులు మంతెన మల్లేశ్, మోతె పోషం, తుంగపిండి రమేశ్, కర్రావుల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు