సగం నిధులివ్వండి

17 Feb, 2015 00:35 IST|Sakshi
సగం నిధులివ్వండి
 • వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయపై ప్రధానికి కేసీఆర్ వినతి
 • కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తగిన ప్రాధాన్యం ఇవ్వండి
 • హైకోర్టు విభజనను వేగంగా చేపట్టండి
 • ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ప్రకటించండి
 • విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కించేందుకు సరఫరా లైన్లు ఏర్పాటు చేయండి
 • విభజన హామీలు, రాష్ట్రానికి     కేంద్ర నిధులపై సీఎం విజ్ఞప్తులు
 • 40 నిమిషాల పాటు ఏకాంత చర్చలు
 • మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానికి కేసీఆర్ ఆహ్వానం!
 • అనంతరం ముంబైకి బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి
 • సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ’ పథకాలకు 50 శాతం కేంద్ర నిధులు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ, ఇంటింటికీ మంచినీటి సరఫరా కోసం చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టులతో పాటు మరిన్ని అంశాల్లో తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినందున వచ్చే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో మోదీతో కేసీఆర్ సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వారు ఏకాంతంగా చర్చలు జరిపారు.
   
  ‘విభజన’ హామీలను నెరవేర్చండి: విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను వీలైనంత త్వరగా నెరవేర్చాలని ప్రధాని మోదీని కేసీఆర్ కోరారు. భేటీలో ప్రధానంగా ఐదు అంశాలపై కేసీఆర్ విజ్ఞప్తులు చేసినట్లు తెలిసింది. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం వీలైనంత త్వరగా హైకోర్టు విభజన చేయాలని కోరారు. ప్రాణహిత-చేవెళ్లప్రాజెక్టుకు జాతీయ హోదాను వెంటనే ప్రకటించాలని, ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించాలని అడిగారు. ఆ ప్రాజెక్టుకు జల సంఘం అనుమతులు రావాల్సి ఉందని, ఈ ప్రక్రియను వేగవంతం చేసేలా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాలని కోరారు.
   
  రాష్ట్రానికి రండి: ‘మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్’ పథకాలను భేటీలో కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు. ఇంటింటికీ మంచి నీరు అందించే ఉద్దేశంతో వాటర్‌గ్రిడ్ పథకాన్ని రూపొందించామని... అదేవిధ ంగా తెలంగాణలోని 45 వేల చెరువులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని రూపొందించామని ప్రధానికి వివరించారు. ఈ రెండు పథకాలకు అయ్యే నిధుల్లో 50 శాతాన్ని కేంద్రం నుంచి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మిషన్ కాకతీయ పథకం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా మోదీని కేసీఆర్ ఆహ్వానించినట్టు సమాచారం.

  విద్యుత్ సమస్యను తీర్చేందుకు వీలుగా మహారాష్ట్రలోని వార్ధా మీదుగా డిచ్‌పల్లి వరకు ట్రాన్స్‌మిషన్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని మోదీని కోరారు. త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాలకు రూ.750 కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనాలు ఉన్నాయని... ఇందుకు కేంద్రం నుంచి కొన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానితో భేటీ అనంతరం కేసీఆర్ నేరుగా ముంబైకి బయలుదేరారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఆయన సమావేశం కానున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా