నేడు మెదక్‌ జిల్లాలో కేసీఆర్‌ పర్యటన 

9 May, 2018 03:00 IST|Sakshi

      సాయంత్రం 4:30 గంటలకు పట్టణానికి రాక 

      కలెక్టరేట్, ఎస్పీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన

సాక్షి, మెదక్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం మెదక్‌ జిల్లాలో పర్యటించనున్నారు. నూతన జిల్లాల ఏర్పాటు అనంతరం మొదటి సారిగా జిల్లాకు రానున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు రెండ్రోజులుగా పట్టణంలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశమై ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

బహిరంగ సభ కోసం జిల్లా నలుమూలల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. కేసీఆర్‌ బుధవారం సాయంత్రం 4.30 గంటలకు హెలికాప్టర్‌లో మెదక్‌ పట్టణం చేరుకుంటారు. అనంతరం ఔరంగాబాద్‌లో రూ.74 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనం, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, హరీశ్‌రావు, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

అనంతరం పట్టణంలోని అతిథి గృహంలో జిల్లా అధికారులతో సీఎం సమావేశమై జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించనున్నారు. అనంతరం 6 గంటలకు మెదక్‌ చర్చి గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గం గుండా కరీంనగర్‌ చేరుకుంటారు.    

మరిన్ని వార్తలు