కేసీఆర్ వందరోజుల పాలనలో నిరాశే

10 Sep, 2014 01:51 IST|Sakshi
కేసీఆర్ వందరోజుల పాలనలో నిరాశే

ఏ ఒక్క హామీపైనా క్లారిటీ రాలేదు
శాసనమండలి విపక్షనేత డి.శ్రీనివాస్

 
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వంద రోజుల పాలన పూర్తిగా నిరాశనే మిగిల్చిందని శాసనమండలి విపక్షనేత డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీపైనా క్లారిటీ రాలేదని విమర్శించారు. మంగళవారం నిజామాబాద్‌లోని మున్నూరుకాపు సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పనితీరుపై ఇంకొంత కాలం వేచి చూస్తామన్నారు. ఎస్సీలకు మూడెకరాల భూమి, రెండు పడక గదులతో పక్కా ఇళ్ల నిర్మాణం, రూ. లక్ష వరకు రుణమాఫీ, ఏడు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ తదితర హామీలన్నీ, వంద రోజులు గడుస్తున్నా కనీసం మొగ్గ తొడగలేదన్నారు. ఎన్నికల హామీలన్నీ తుంగలో తొక్కి, తెలంగాణలోని మూడు ప్రాంతాలను ‘సింగపూర్’లా అభివృద్ధి చేస్తానని అమాయక ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

 మార్పు అధిష్టానం ఇష్టం

 మెదక్ ఉప ఎన్నికలకు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి మార్పునకు సంబంధం లేదని డీఎస్ చెప్పారు. కొత్త కమిటీ వేయాలనుకున్నా, పాత కమిటీనే కొ నసాగించాలనుకున్నా అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. ‘‘ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు గుర్తించారు. కానీ, కేసీఆర్‌ను సీఎంగా చూడాలనుకున్నారు.’ అని డీఎస్ పేర్కొన్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచి తీరతారన్నారు.  పోలవరంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామన్న కేసీఆర్ కాలయాపన చేశారన్నారు.  భయాందోళనకు గురిచేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బలం పెంచుకోవాలని చూడటం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.
 
 

మరిన్ని వార్తలు