రేపు సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌

21 Jun, 2020 04:48 IST|Sakshi

కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి పరామర్శ

మీడియాకు వెల్లడించిన మంత్రి జగదీశ్‌రెడ్డి

సాక్షి, ప్రతినిధి, సూర్యాపేట: కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం మధ్యాహ్నం సూర్యాపేటకు రానున్నారని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. శనివారం మంత్రితో పాటు ఆయన భార్య సునీత.. సంతోష్‌బాబు తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, భార్య సంతో షిని పరామర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సంతోష్‌బాబు కుటుంబ సభ్యుల అభీష్టం మేరకు సీఎం కేసీఆర్‌ వారి నివాసానికి వస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయంతో పాటు గ్రూప్‌–1 ఉద్యోగానికి సంబంధించిన ఉత్తర్వులను సీఎం కేసీఆర్‌ స్వయంగా కల్నల్‌ కుటుంబ సభ్యులకు అందజేస్తారన్నారు. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. భవిష్యత్‌లో వారి కుటుంబ అవసరాల రీత్యా రూ.5 కోట్ల నగదు, నివాస స్థలాన్ని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు. అయితే ఇంటిస్థలం అన్నది సూర్యాపేటలోనా లేక హైదరాబాద్‌లోనా అన్నది సంతోష్‌బాబు కుటుంబ సభ్యుల ఇష్టానుసారంగా ప్రభుత్వం నిర్ణయం తీసు కుంటుందని తెలిపారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఉన్నారు.

వాడపల్లి సంగమంలో సంతోష్‌బాబు అస్థికల నిమజ్జనం 
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి కృష్ణా – మూసీ సం గమంలో కల్నల్‌ సంతోష్‌ అస్థికలను శనివా రం కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. సంతోష్‌ తండ్రి ఉపేందర్, తల్లి మంజులతో పాటు భార్య సంతోషి, కొడుకు, కూతురు ప్రత్యేక వాహనంలో వాడపల్లికి వచ్చారు. పడవలో సంగమం వద్దకు వెళ్లి వేదమంత్రాల నడుమ అస్థికలను నిమజ్జనం చేశారు.

>
మరిన్ని వార్తలు