కలెక్టర్లకు ‘పుర’పవర్స్‌

10 Jul, 2019 00:55 IST|Sakshi

మున్సిపాలిటీల పాలనపై జిల్లా కలెక్టర్లకు సంపూర్ణ అధికారాలు 

కార్పొరేషన్ల పర్యవేక్షణ కూడా.. ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష 

కొత్త చట్టం పరిధిలోకి పాలక వర్గాలు.. అవసరమైతే రీకాల్‌ చేసే అధికారం 

కలెక్టర్‌ నిర్ణయాన్ని సమీక్షించేందుకు ప్రత్యేక అప్పిలేట్‌ అథారిటీల ఏర్పాటు 

అథారిటీ చైర్మన్‌గా జిల్లా జడ్జి స్థాయి అధికారి ఉండే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటివరకు జిల్లా కలెక్టర్లు పంచాయతీలు, గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టి సారిస్తూ వస్తున్నారు. మున్సిపాలిటీల్లో సమస్యలను ఆయా పాలకవర్గాలు, అధికారులే పరిష్కరించేవారు. ఒకవేళ అందులో విఫలమైనా కలెక్టర్లు చర్యలు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. ప్రజలు బయటకు వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేసినా అది పట్టణానికే పరిమితమయ్యేది. దీంతో తీవ్రమైన సమస్య ఉత్పన్నమైతే తప్ప ప్రభుత్వం రంగంలోకి దిగేది కాదు. ఈ పరిస్థితి కొత్త చట్టంతో మారిపోనుంది. పురపాలికల్లో ఏ సమస్య తలెత్తినా వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు తప్పనిసరి కానుంది. దీంతో మున్సిపాలిటీల్లో అడ్డగోలు వ్యవహారాలకు కళ్లెం పడనుంది. పాలనలో పారదర్శకత, పాలకవర్గాల్లో జవాబుదారీతనం పెంపొందించేలా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను ప్రతి ఒక్కరిని బాధ్యులను చేసేలా కొత్త పురపాలక చట్టంలో నిబంధనలను రూపొందిస్తున్నారు.

ఈ చట్టం అమలు బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించనున్నారు. పట్టణ స్థానిక సంస్థలపై కలెక్టర్లకు సంపూర్ణ అధికారాలు కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు అమలు చేయడమే కాకుండా పురపాలనను గాడిలో పెట్టే బాధ్యతను కూడా వారికే అప్పగించింది. మున్సిపాలిటీలను పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా చేపట్టనుంది. తద్వారా పురపాలక సంఘాలపై ప్రభుత్వ అజమాయిషీ కొనసాగనుంది. ఇందులో భాగంగా పన్నుల వసూళ్లు, హరితహారం, ప్రభుత్వ పథకాల అమలులో పాలకవర్గాలను బాధ్యులను చేయనుంది. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టనుంది. ఇప్పటివరకు పాలకవర్గాల తీర్మానాలను మాత్రమే సమీక్షించే అధికారం కలెక్టర్లకు ఉండేది. కొత్త చట్టంలో అవసరమైతే ప్రజాప్రతినిధులపై వేటు వేసే విచక్షణాధికారం కూడా కలెక్టర్లకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి 15 రోజులకోసారి మున్సిపాలిటీలను తనిఖీ చేసేలా, పనితీరు సమీక్షించేలా జాబ్‌చార్ట్‌ను రూపొందిస్తోంది. 

అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌..! 
ప్రజాప్రతినిధులపై తీసుకునే చర్యలను సమీక్షించేందుకు ప్రత్యేక అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుత చట్టం ప్రకారం ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికే ఉండేది. తాజాగా దీన్ని కలెక్టర్లకు కట్టబెడుతూ.. సమీక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి జిల్లా జడ్జి స్థాయి అధికారి అప్పిలేట్‌ అధికారిగా వ్యవహరించే అవకాశముంది. 

ప్రజాప్రతినిధులపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు 
ఇటీవల జరిగిన ఓ మున్సిపల్‌ సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు మున్సిపల్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టౌన్‌ ప్లానింగ్‌ అంతా అవినీతిమయం అయిపోయిందని, ఈ వ్యవస్థ ప్రజలకు ఉపయోగపడట్లేదని సీఎం అభిప్రాయపడ్డట్లు సమాచారం. టౌన్‌ ప్లానింగ్‌తో పాటు ప్రజాప్రతినిధులపై కూడా ఆయన చేసిన కీలక వ్యాఖ్యల ఆధారంగానే కొత్త చట్టంలో కలెక్టర్లకు కీలక అధికారాలిస్తున్నారనే చర్చ జరుగుతోంది. తాము ఇటీవలే హైదరాబాద్‌లో సర్వే నిర్వహించామని, ఇందులో 90 శాతం మంది కార్పొరేటర్లు అవినీతిపరులనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, వీరి వల్ల స్థానికంగా ఎలాంటి ఉపయోగం లేదని, వీరి కంటే ప్రత్యేకాధికారుల పాలనే మేలనే ఉద్దేశంతో ప్రజలున్నారని చెప్పిన కేసీఆర్‌ అవినీతి చేసినా, అంకిత భావంతో పనిచేయకపోయినా చైర్మన్లు, కౌన్సిలర్లను కూడా సస్పెండ్‌ చేసే అధికారాలుండాలని చెప్పారని ఉన్నతాధికారులు చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు