ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ..! 

18 Jan, 2019 00:50 IST|Sakshi
అసెంబ్లీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కరచాలనం చేస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో హోంమంత్రి మహమూద్‌ అలీ

తొలిరోజు సభలో ఆకట్టుకున్న కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రచారంలో కనిపించిన రాజకీయ వేడిని పక్కనపెట్టి తెలంగాణ రెండో అసెంబ్లీ తొలిరోజు సమావేశాల్లో సీఎం, అధికార, విపక్ష సభ్యు లు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఉదయం కేసీఆర్‌ సభలోకి రాగానే నేరుగా ప్రతిపక్ష నేతల బెంచీల వద్దకు వెళ్లారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుసహా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కరచాలనం చేసి అభినందించారు. కాసేపు వారి తో ముచ్చటించిన తర్వాత మజ్లిస్‌ ఎమ్మెల్యేల వద్దకొచ్చి కరచాలనం చేశారు.  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు నమస్కారం చేసి తన స్థానంలో కూర్చున్నారు. హోంమంత్రి మహమూద్‌ అలీ కూడా సీఎంను అనుసరిస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కరచాలనం చేశారు. 11:34 గంటలకు కేసీఆర్‌ తన ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అ«ధికారులకు అందజేశాక.. ఆయనతో ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రమాణం చేయించారు. సీఎం దైవసాక్షిగా తెలుగులో ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపి రిజిస్టర్‌లో సంతకం చేశారు. 11:55 గంటలకు బయటకు వెళ్లి మధ్యాహ్నం 1:10 గంటలకు మళ్లీ సభలోకి వచ్చిన కేసీఆర్‌.. వాయిదా పడే వరకు సభలోనే ఉన్నారు. 

కేసీఆర్‌లాగే.. కేటీఆర్‌! 
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా తండ్రి తరహాలోనే వ్యవహరించారు. తన నియామకపత్రాన్ని అధికారులకు అందజేసి, పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు.  ప్రొటెం స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపి రిజిస్టర్‌లో సంతకం చేశారు.  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బెంచీల వద్దకు వెళ్లి వారికి నమస్కరించి, కరచాలనం చేశారు.  అక్కడు న్న మల్లు భట్టి విక్రమార్కతోపాటు ఇతర ఎమ్మెల్యేలతో ముచ్చటిం చి తన స్థానం వద్దకు వెళ్లారు. 

హరీశ్‌కు సభ్యుల నమస్కారం
సభ్యులు ప్రమాణం చేసిన పోడియం వెనుక భాగంలోనే మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. హరీశ్‌రావు తదితరులు కూర్చున్నారు. ప్రమాణం చేసిన ప్రతి సభ్యుడు వెనక్కు తిరిగి అభివాదం చేయడంతో హరీశ్‌ ప్రతినమస్కారం చేశారు. తన ప్రమాణ స్వీకారం అనంతరం హరీశ్‌ కూడా సీఎం కేసీఆర్‌ వద్దకు వెళ్లి నమస్కరించి, ప్రొటెం స్పీకర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారం తరువాత ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. కేసీఆర్‌ సభ మధ్యలో బయటకెళ్లి వస్తున్న సమయంలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కేసీఆర్‌కు పాదాభివందనం చేయబోగా ఆయన వద్దని వారించారు.   

మరిన్ని వార్తలు