‘ఆంక్షల’ పంచాయితీ ప్రెస్ అకాడమీకి...

21 Feb, 2015 02:22 IST|Sakshi
సచివాలయంలో సమత బ్లాకు వద్ద కెమెరాలు, స్టౌండ్లను నేలపై పెట్టి పాత్రికేయుల నిరసన

* నేడు ప్రెస్ అకాడమీ
పాలక మండలి సమావేశం
పాల్గొననున్న సీఎం కేసీఆర్

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయుల ప్రవేశంపై ఆంక్షల విధింపు వ్యవహారంపై పాత్రికేయులు, రాజకీయవర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు శనివారం సీనియర్ జర్నలిస్టులతో సమావేశం కానున్నారు. పత్రికల సంపాదకులు, పాత్రికేయ సంఘాలతో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ అకాడమీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కేసీఆర్ హాజరై పాత్రికేయులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పాత్రికేయులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల పంపిణీ, అక్రెడిటేషన్ కార్డుల జారీ తదితర అంశాలతోపాటు సచివాలయంలో పాత్రికేయుల ప్రవేశంపై ఆంక్షల అంశంపైనా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. సచివాలయంలో పాత్రికేయుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలా? గుర్తింపు కార్డులు జారీ చేసి పరిమిత సంఖ్యలో, నిర్దేశిత వేళల్లోనే అనుమతించాలా? అనే అంశాలపై ఈ భేటీలో నిర్ణయించే అవకాశముంది.
 
 నేడే వెలువడనున్న ఉత్తర్వులు!
 రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయుల ప్రవేశంపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ప్రెస్ అకాడమీ పాలక మండలి భేటీ ముగిసిన వెంటనే సర్కారు ఉత్తర్వులు జారీ చేయనుందని సమాచారం. మీడియాపై ప్రభుత్వ ఆంక్షల యోచన అంశంపై శుక్రవారం పత్రికల్లో వచ్చిన కథనాలపై పాత్రికేయ వర్గాల్లో తీవ్ర అలజడి రేగినా, రాజకీయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించినా..రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మౌనాన్ని పాటించి తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని సంకేతాలు పంపింది. ఈ అంశంపై శనివారం సాయంత్రంలోగా ప్రభుత్వ నిర్ణయం అధికారికంగా వెల్లడి కానుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సచివాలయంలో మీడియా ప్రతినిధుల ప్రవేశంపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ద్వారా ఓ సర్క్యులర్ జారీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ శుక్రవారం మధ్యహ్నాం సచివాలయంలో పోలీసు శాఖ డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డితో సమావేశం కావడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూర్చింది.
 
 సచివాలయంలో జర్నలిస్టుల నిరసన..
 సచివాలయంలో జర్నలిస్టుల ప్రవేశంపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తోందనే వార్తలపై సచివాలయంలో రోజువారి విధులు నిర్వహించే జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు శుక్రవారం ఆందోళనబాట పట్టారు. వీడియో కెమెరాలు, స్టాండ్లను నేలపై పెట్టి సీఎం కార్యాలయం ఉన్న సమత బ్లాక్ ఎదుట కొన్ని నిమిషాలపాటు మౌనం పాటిస్తూ నిరసన తెలిపారు. పలువురు జర్నలిస్టులు చొక్కాలకు నల్ల రిబ్బన్లను ధరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం సచివాలయంలో పాత్రికేయులు నిరసన తెలపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అనంతరం ఈ అంశంపై పాత్రికేయులు రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాలశాఖ కమిషనర్ చంద్రవదన్ ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజువారి ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారని జర్నలిస్టులపై నిందలు మోపడం తగదన్నారు. పాత్రికేయులపై నిషేధం విధించాలనేది ప్రభుత్వ నిర్ణయమైతే నేరుగా ప్రకటించాలని.. ఇలాంటి సాకులు చూపి పాత్రికేయులను అవమానించవద్దని కోరారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, శనివారం సాయంత్రం వరకు వేచి చూడాలని చంద్రవదన్ పాత్రికేయులకు బదులిచ్చారు.
 
 మీడియాపై ఆంక్షలు వద్దు: కొండా
 సచివాలయంలోకి మీడియాను అనుమతించకూడదనే  రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ తప్పుపట్టింది. ప్రభుత్వానిది దుర్మార్గమైన ఆలోచనని, దానిని వెంటనే విరమించుకోవాలని ఆ పార్టీ అధికారప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పారదర్శక పాలనను అందిస్తామన్న  కేసీఆర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. తెలంగాణ విద్యార్థులు కులూ-మనాలిలో చిక్కుకుపోతే వారిని ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని విమర్శించారు.  
 
 మీడియాను నియంత్రిస్తే పోరు: టీడీపీ
 సచివాలయంలోకి మీడియాను అనుమతించకూడదని తీసుకునే నిర్ణయం పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కును హరించడమేనని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహు లు అన్నారు.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే.. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చినవారి పట్ల కేసీఆర్ ప్రేమ కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.  కేసీఆర్ తీరుకు వ్యతిరేకంగా 28న దీక్ష చేస్తానన్నారు.
 

మరిన్ని వార్తలు