కేసీఆర్‌ మాటలే విజయారెడ్డి హత్యకు దారి తీశాయి

8 Nov, 2019 09:37 IST|Sakshi
తహసీల్దార్‌ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న హనుమంతరావు

రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి 

కర్నాటక తరహా చట్టాలు రావాలి 

తహసీల్దార్‌ హత్యోదంతంపై సీబీఐ విచారణ చేపట్టాలి 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌

సాక్షి, హయత్‌నగర్‌: అధికారులపై ప్రజలు రెచ్చిపోయే విధంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడిన మాటలే విజయారెడ్డి హత్యకు దారితీశాయని, రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, లేదంటే విజయారెడ్డి వంటి ఘటనలు పెరిగిపోయే ప్రమాదం ఉందని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి. హనుమంతరావు అన్నారు. విజయారెడ్డి హత్యకు గురైన అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వీహెచ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చాలామంది రైతులు ఏళ్ల తరబడి పట్టాదారు పాస్‌బుక్‌ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, రెవెన్యూ చట్టాల్లో చాలా లొసుగులు ఉన్నాయని విమర్శించారు. వాటిని ఆసరాగా చేసుకుని అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, మార్పులు రాకుంటే ఇలాంటి హత్యలు పెరుగుతాయని తెలిపారు. మ్యుటేషన్‌  పేరుతో రెవెన్యూ సిబ్బంది రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని విమర్శించారు.

కర్ణాటక తరహాలో భూములను కొన్న మరునాడే రెవెన్యూ రికార్డులు మారేవిధంగా వ్యవస్థ ఉండాలని, రెవెన్యూ చట్టాల్లో మార్పుల కోసం కర్ణాటకలోని విధానాలపై అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. పటేల్, పట్వారీల కాలంలో రెవెన్యూ  వ్యవస్థ పటిష్టంగా ఉండేదని, వీఆర్‌ఓల వ్యవస్థ కారణంగా వారికి అవగాహన లేక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. రిజిస్ట్రేషన్‌  వ్యవస్థలో లోపాల కారణంగా డబుల్, త్రిబుల్‌ రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. సీబీసీఐడీ విచారణపై తనకు నమ్మకం లేదని, గతంలో వారు విచారణ జరిపిన నయీం హత్య కేసు ఎంతవరకు వచ్చిందని, అతడి డబ్బులు ఏమయ్యాని ఆయన ప్రశ్నించారు. తహసీల్దార్‌ విజయారెడ్డి భర్త కోరిన విధంగా సీబీఐ విచారణ చేట్టాలని, హంతకుడి వెనుక ఉన్న వారిని బయటకు తీసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి ఘటనపై వివరాలు సేకరించారు. పీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందికి భరోసా కల్పించి తహసీల్దార్‌ కార్యాలయాల్లో భద్రతను పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బుర్రరేఖ మహేందర్‌గౌడ్, నాయకులు గుండ్ల వెంకట్‌రెడ్డి, యాదగిరిచారి తదితరులు ఉన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు