అనాథల కోసం నిత్యం పిడికెడు బియ్యం సేకరణ

22 Nov, 2019 10:12 IST|Sakshi

అనాథల ఆకలి తీర్చే ఆలోచన!

వారిని ఆదుకునేందుకు బియ్యం సేకరిస్తున్న విద్యార్థులు 

500 కిలోలు జమ కావడంతో అనాథాశ్రమ  నిర్వాహకులకు అందజేత

సాక్షి, చేవెళ్ల: అనాథ పిల్లలకు అన్నం పెట్టి కడుపు నింపాలనే గొప్ప ఆశయంతో ఆ విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిత్యం అందరూ పిడికెడు బియ్యం తీసుకొచ్చి జమ చేశారు. పదిరోజుల్లో 500 కిలోలు జమ కావడంతో అనాథ ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు. వివరాలు.. మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న కేజీరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలోని ఎన్ఎస్‌ఎస్‌ విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనతో అనాథ పిల్లలకు తమవంతు సహకారం అందించాలని ఆలోచించారు. ఎవరూ లేని చిన్నారులకు అన్నం పెట్టి కడుపు నింపాలని భావించారు. అందుకోసం బియ్యం సేకరణకు శ్రీకారం చుట్టారు. పది రోజులపాటు ఒక్కో విద్యార్థి పిడికెడు చొప్పున బియ్యాన్ని తీసుకొచ్చి జమచేశారు. గురువారానికి 500 కేజీల బియ్యం కావడంతో వాటిని అనాథ ఆశ్రమాలు నడుపుతున్న నాలుగు సంస్థలకు అందజేశారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.

మరిన్ని వార్తలు