‘కేజీ టు పీజీ’ అందించడమే లక్ష్యం: కడియం

27 Jan, 2015 03:12 IST|Sakshi
‘కేజీ టు పీజీ’ అందించడమే లక్ష్యం: కడియం

జనగామ: కేజీ టు పీజీ ఉచిత విద్య అందించడమే తన లక్ష్యమని తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొలిసారిగా సోమవారం వరంగల్ జిల్లాకు వచ్చారు. ఆయనకు వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ శ్రేణులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టాయి.

జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, మడికొండ, కాజీపేట, హన్మకొండలోని ఏకశిల పార్కులో జరిగిన సభల్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పదవి వరించిందని.. విశ్వాసంతో పనిచేస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడతానన్నారు. ఏ సీఎం చేయని విధం గా నాలుగు రోజులు వరంగల్ మురికివాడల్లో  పర్యటించి అప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి రూ.400 కోట్లు విడుదల చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
 
పొన్నాలవి  ప్రగల్భాలు

‘మా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో చావుదెబ్బతిని లేవలేని స్థితిలో ఉన్న టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు.’ అని కడియం విమర్శించారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం పార్టీలకతీతంగా అందరూ కలసిరావాలని సీఎం కేసీఆర్ కోరుతుండగా పొన్నాల రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. 2019లో ఎవరేమిటో తేలుతుందని.. ఇప్పుడు మాత్రం అభివృద్ధికి సహకరించాలన్నారు.  
 
రాజయ్యపై ప్రేమ, అభిమానం ఉంది..

డాక్టర్ రాజయ్య తనకు సోదరుడి లాంటివాడని, అతడిపై ప్రేమ, అభిమానం ఉందన్నారు. ఊహించని రీతిలో మార్పు జరిగిందని మంత్రి శ్రీహరి అన్నారు. గ్రామాల్లో  కడియం, రాజయ్య వర్గం అంటూ అభిప్రాయభేదాలు సృష్టించవద్దని, ఏమైనా  పొరపాట్లు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దల పద్మనర్సింగరావు, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, ఎమ్మెల్సీలు రాజలింగం, బోడకుంటి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు