కేజీబీవీల్లో ఇంటర్‌..

10 Jun, 2019 08:36 IST|Sakshi

నల్లగొండ : జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో కళాశాలలను ప్రారంభించేందుకు ప్రభుత్వం పూనుకుంది. జిల్లాలో 14 కసూరిబా గాంధీ పాఠశాలలు ఉండగా ఇప్పటికే ఆరు పాఠశాలల్లో కళాశాలలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సంవత్సరం మరో మూడు పాఠశాలల్లో కళాశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జిల్లాలోని చండూరు, దామరచర్ల, పెద్దవూర మండలాల్లోని కస్తూరిబా పాఠశాలకు కళాశాలలను మంజూరు చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంటర్‌ తరగతులు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలో 14 కేజీబీవీలు..
పేద, తల్లిదండ్రులు లేని నిరుపేద బాలికల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేజీబీవీలను ప్రారంభించారు. జిల్లాలో 14 కస్తూరిబా గాంధీ బాలి కల విద్యాలయాలు ఉన్నాయి. అవన్నీ తెలుగు మీడియంలోనే ప్రారంభమయ్యాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ టూ పీజీ ఇంగ్లిష్‌ మీడి యం పాఠశాలల నిర్మాణానికి పూనుకుంది. దాంతో కేజీబీవీల్లో ఇంగ్లిష్‌ బోధన చేసేందుకు ఉపాధ్యాయులు ముందుకొచ్చిన పాఠశాలలను ఇప్పటికే ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలుగా మార్చారు. ఈ సంవత్సరం  కూడా ప్రభుత్వం ఇంగ్లిష్‌ మీడియం బోధించే పాఠశాలలు ఉంటే ప్రతిపాదనలు పంపాలని జిల్లా విద్యాశాఖను కోరింది. జిల్లాలో ఏ పాఠశాలల నుంచి కూడా ఉపాధ్యాయులు ఇంగ్లిష్‌లో బోధన చేసేందుకు ముందుకు రాకపోవడంతో ప్రతిపాదనలు పంపని విషయం తెలిసిందే.

మూడు పాఠశాలకు కళాశాలలు మంజూరు..
జిల్లాలోని చండూరు, పెద్దవూర, దామరచర్ల మండలాల్లోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో కళాశాలలు ప్రారంభించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీట్ల భర్తీ ప్రక్రియ కూడా ప్రారంబించారు. ఒక్కో కళాశాలలో 2 గ్రూపులు ఏర్పాటు చేయనున్నారు. చండూరులోని కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులను మంజూరు చేయగా, పెద్దవూర, దామరచర్ల మండలాల్లోని కళాశాలలకు ఎంపీహెచ్‌డబ్ల్యూ, సీఈసీ గ్రూపులను మంజూరు చేసింది. ఒక్కో గ్రూపుకు 40 సీట్లు ఉంటాయి. అంటే 2 గ్రూపులకు కలిపి ఒక్కో కళాశాలకు 80 సీట్లు మంజూరయ్యాయి. ఈ కళాశాలల్లో అధ్యాపకులను భర్తీ చేసేంత వరకు ఉన్నవారితోనే బోధన చేపట్టనున్నారు. అయితే ఈ మూడు మండలాల్లోని కేజీబీవీల్లో చదివే విద్యార్థినులతో పాటు జిల్లాలోని ఏ విద్యార్థులైనా ఈ కళాశాలల్లో చదివేందుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 17 నుంచి కళాశాలలు ప్రారంభం కానున్నాయి. వాటితో పాటే కేజీబీవీల్లోని కొత్త కళాశాలలు కూడా ప్రారంభిస్తారు. అప్పటిలోగా ఈ 3 కళాశాలల్లో సీట్లను భర్తీ చేసేందుకు అధికారులు దరఖాస్తు ప్రక్రియను చేపట్టారు.

తల్లిదండ్రులు లేని విద్యార్థులకు అధిక ప్రాధాన్యం
ఈ కళాశాలల్లో చేరేందుకు తల్లిదండ్రులు లేని, పేద విద్యార్థినులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మిగిలిన సీట్లను జిల్లాలోని విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కేజీవీబీల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు కూడా చేరవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి చేరేందుకు అవకాశం కల్పించారు. 

ఆసక్తి చూపని విద్యార్థినులు
ఆయా కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో కొత్తగా కళాశాలలు ఈ విద్యాసంవత్సరం ప్రారంభిస్తున్నా అదే పాఠశాలల్లో పదో తరగతి పాసైన విద్యార్థినులు మాత్రం చేరేందుకు పెద్దగా శ్రద్ధ చూపడంలేదు. అందుకు ప్రధాన కారణం తెలుగు మీడియంలోనే ఇంటర్‌ విద్య ప్రారంభించడం. కస్తూరిబాలో పదో తరగతి పాసైన వారు ఇంగ్లిష్‌ మీడియం కళాశాలలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి ఈ సంవత్సరం మరో మూడు కస్తూరిబా కళాశాలలు మంజూరు కావడం వల్ల పేద విద్యార్థినులకైతే మేలు జరగనుంది.   

మరిన్ని వార్తలు