కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత 

14 Mar, 2020 10:30 IST|Sakshi

సాక్షి, కేశంపేట : పాడైన కూరగాయలతో చేసిన వంటల కారణంగా ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. పాటిగడ్డలోని కస్తూర్బా పాఠశాలలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మండల పరిధిలోని పాటిగడ్డ కస్తూర్బా పాఠశాలలో 262 మంది చదువుకుంటున్నారు. వీరికి నిత్యం మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉండగా.. నిర్వాహకులు మాత్రం తమ ఇష్టానుసారం వండిపెడుతన్నారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన కూరగాయలతో వంటలు చేస్తున్నారు. ఈ భోజనం తిన్న బాలికలు అస్వస్థతకు గురవుతున్నారు. దీనికి తోడు స్కూల్‌లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. వాష్‌బేషిన్ల వద్ద నాచు పేరుకుపోయింది. మూత్రశాలలు కంపు కొడుతున్నాయి. పాఠశాల లోపల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఈ విషయమై కేజీబీవీ ప్రత్యేక అధికారి గౌసియాను అడగగా.. ఉదయం విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ఆయాలు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. దీంతో మూత్రశాలలను శుభ్రం చేయలేదన్నారు.   

నాయకుల సందర్శన..   
విద్యార్థులు ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న పలు కుల సంఘాల నాయకులు కేజీబీవీని సందర్శించారు. వంటలు, కిచెన్, బాత్‌రూంలను పరిశీలించారు. పలువురు విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మెనూ పాటించడం లేదని, బాత్‌రూంలను శుభ్రం చేయడం లేదని విద్యార్థులు వీరికి వివరించారు. ఇదిలా ఉండగా బాలికలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం అందించిన వాటర్‌ ఫిల్టర్‌ నిరుపయోగంగా ఉంది. నిత్యం కేశంపేట, సంతాపూర్‌ నుంచి ఫిల్టర్‌ వాటర్‌ తెస్తున్నారు. 

మరిన్ని వార్తలు