‘అమ్మ’ను ఎక్కడికి పంపిస్తారు సార్‌..!?

7 Feb, 2020 09:32 IST|Sakshi

ప్రిన్సిపల్‌ బదిలీని అడ్డుకునేందుకు పరుగులు పెట్టిన విద్యార్థినులు

మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ అంటారు. విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకుంటూ.. విద్యాబుద్ధులు నేర్పుతారు కాబట్టే భారతీయ సంస్కృతి గురువుకు తల్లిదండ్రుల తర్వాతి స్థానం కల్పించింది. అయితే ఆ స్థానాన్ని నిలబెట్టుకునే వారు కొంతమందే ఉంటారు. నీలాంబరి ప్రిన్సిపల్‌ ఆ కోవకు చెందినవారే. అందుకే అమ్మలా ఎల్లప్పుడూ తమ వెంట ఉండి నడిపించిన ఆమెను అధికారులు బదిలీచేస్తే పిల్లలు తట్టుకోలేకపోయారు. ఆందోళనకు దిగి.. రోడ్లవెంట పరుగులు తీశారు. ఆఖరికి విజయం సాధించారు.  

సాక్షి, నల్గొండ : పాఠశాల స్పెషల్‌ ఆఫీసర్‌(ఎస్‌ఓ) బదిలీని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థినులు ఆందోళన చేసిన సంఘటన కేతేపల్లి మండలంలోని చెర్కుపల్లి కస్తూరిబా గాంధీ(కేజీబీవీ) బాలికల పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. మండలంలోని చెర్కుపల్లి కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్‌ నీలాంబరి పదిరోజుల క్రితం సెలవులపై వెళ్లారు. కాగా ఇటీవల ఆమెను కట్టంగూర్‌ కేజీబీవీ పాఠశాల బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

నాంపల్లి పాఠశాల ఎస్‌ఓ వసంతను చెర్కుపల్లి పాఠశాలకు బదిలీ చేశారు. దీంతో చెర్కుపల్లి పాఠశాలలో బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఎస్‌ఓ వసంతను చూసి విద్యార్థినులు పాఠశాల ప్రధాన గేటును మూసి ఆందోళనకు దిగారు. కొత్తగా వచ్చిన ఎస్‌ఓ బాధ్యతలు స్వీకరించకుండా అడ్డుకున్నారు. తమను సొంత పిల్లలా చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పుతున్న పాత ఎస్‌ఓ నీలాంబరిని అధికారులు అకారణంగా బదిలీ చేశారని, బదిలీ ఉత్తర్వులను తక్షణమే రద్దు చేసి ఎస్‌ఓగా నీలాంబరిని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

ఈ క్రమంలో సమాచారం అందుకున్న జీసీడీఓ అరుణశ్రీ, కేతేపల్లి తహసీల్దార్‌ డి.వెంకటేశ్వర్లు, గోలి చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐ శ్యాంసుందర్‌రెడ్డి పాఠశాల వద్దకు చేరుకున్నారు.  విద్యార్థినులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.  అనంతరం  పాఠశాల నుంచి విద్యార్థినులు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాతీయ రహదారి వైపు పరుగులు తీశారు. కేతేపల్లి, నకిరేకల్‌ ఎస్‌ఐలు రామకృష్ణ, హరిబాబులు తమ సిబ్బందితో కొండకింది గూడెం శివారులో ఏఏమార్పీ డీ-49 కాల్వ వద్ద విద్యార్థినులను అడ్డగించారు.  దీంతో రోడ్డుపైనే బైఠాయించిన విద్యార్థినులు ఆందోళనకు దిగటంతో డీఈఓ భిక్షపతి విద్యార్థినులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎస్‌ఓ బదిలీని రద్దుచేసి ఇక్కడే కొనసాగించేలా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇవ్వడంలో సాయంత్రం ఆరు గంటలకు ఆందోళన విరమించిన విద్యార్థినులు పాఠశాల బాట పట్టారు.

మరిన్ని వార్తలు