కరోనా 'ఖబరస్థాన్‌'

27 May, 2020 10:13 IST|Sakshi

 కోవిడ్‌ మృతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు  

ఎంపీ అసదుద్దీన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ల చొరవ  

మృతదేహాల ఖననానికి 50 ఎకరాల కేటాయింపు  

బాలాపూర్‌ ఫకీర్‌ముల్లా దర్గా సమీపంలో..  

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పూడ్చివేత 

సాక్షి, సిటీబ్యూరో: మనిషి జీవితంలో మరణం సహజం. ఏదో ఒకరోజు మృత్యువు పలకరిస్తుంది. అందరూ పుడమితల్లిలో లీనం కావాల్సిందే. కానీ కరోనా వైరస్‌తో మృత్యువాత పడినవారిని ఖననం చేయడం ఓ సమస్యగా మారింది. మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు ఇటు జీహెచ్‌ఎంసీ, అటు పోలీస్, వైద్యారోగ్య శాఖలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో శవాల ఖననం సమస్య తీవ్ర స్థాయికి చేరింది. పలు సందర్భాల్లో కుటుంబ సభ్యులు కూడా శవాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్న పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కరోనాతో మరణించిన ముస్లింల కోసం బాలాపూర్‌లోని ఫకీర్‌ముల్లా దర్గా సమీపంలో ప్రత్యేకంగా ఖబరస్థాన్‌ ఏర్పాటు చేశారు. బాలాపూర్‌ మండలం హయాతుల్లాఖాన్‌ వక్ఫ్‌ బోర్డుకు చెందిన 100 ఎకరాల భూమిని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్మే అక్బర్‌ ఒవైసీ ఇందుకోసం  కేటాయించారు. దీంతో ఈ ప్రాంతంలో కోవిడ్‌ మృతులను ఇక్కడ ఖననం చేస్తున్నారు. అయితే.. ఇటీవల కరోనాతో మృతి చెందిని వారి ఖనన సమస్య తలెత్తడంతో హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వంద ఎకరాల్లో ఉన్న శ్మశానంలోనుంచి 50 ఎకరాలు స్థలాన్ని కరోనా మృతుల ఖననానికి కేటాయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఖననం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. 

స్థానిక శ్మశానాల్లో నిరాకరించడంతో.. .
కరోనా మృతుల ఖననానికి స్థానికంగా ఉన్న శ్మశానాల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థలం సమస్యతో పాటు వైరస్‌ ప్రబలకుండా జాగ్రత్తల కోసం నిరాకరిస్తున్నారు. కారణం.. మృతుడి ద్వారా వైరస్‌ ఇతరులకు ప్రబలే ప్రమాదం పొంచి ఉందని జాగ్రత్త వహిస్తున్నారు. మరణించిన వ్యక్తికి స్థానిక ప్రదేశంలోని ఖబరస్థాన్‌లో ఖననం చేయడానికి పలు ప్రాంతాల్లో అనుమతించడం లేదు. మరికొన్ని ప్రాంతాల శ్మశానాల్లో కమిటీలు ఖననం కోసం స్థలాలు కేటాయించడం లేదు. నగరంలో దాదాపు అన్ని శ్మశానాలు జనావాసాల మధ్యనే ఉన్నాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న వారికి వైరస్‌ సోకుతుందనే భయం వెంటాడుతోంది. ఈ కారణంగా కరోనా మృతుల కోసం  బాలాపూర్‌లో ప్రత్యేకంగా ఖబరస్థాన్‌ను ఏర్పాటు చేశారు. 

నిబంధలకనుగుణంగానే.. 
కరోనాతో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు స్థానిక కార్పొరేటర్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం కార్పొరేటర్‌ ఖబరస్థాన్‌ ఇన్‌చార్జి మహ్మద్‌ సిరాజుద్దీన్‌ ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తారు. అతడు పూర్తి వివరాలు తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమాధి తవ్విస్తారు. ఒకవేళ పేదవారైతే అన్ని ఖర్చులూ స్థానిక శ్మశాన కమిటీనే భర్తిస్తుంది. మృతదేహాన్ని  జీహెచ్‌ఎంసీ, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు పోలీసుల సమక్షంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖననం చేస్తారు.  

మరిన్ని వార్తలు