ఖైరతాబాద్‌ గణేషుని ఎత్తు ఖరారు

2 Jul, 2020 18:12 IST|Sakshi

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ వినాయకుడిపై కూడా కరోనా ప్రభావం పడింది. కరోనా నేపథ్యంలో ఈ సారి 27 అడుగుల ఎత్తులో మట్టి వినాయకున్ని ప్రతిష్టంచనున్నట్టు  ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. ధన్వంతరి రూపంలో ఈ ఏడాది ఖైరతాబాద్‌ వినాయకుడు దర్శనం ఇవ్వనున్నట్టుగా కమిటీ సభ్యులు చెప్పారు. ఒక చేతిలో అమృతం, మరో చేతిలో ఆయుర్వేదంతో గణేషుడు కనిపించనున్నారు .ప్రతి ఏడాదిలాగే శిల్పి రాజేందర్‌ వినాయకుడి విగ్రహాన్ని రూపొందించనున్నారు.(చదవండి : కరోనా పరీక్షలు నిలిపేస్తున్నామని ఎలా చెబుతారు?)

కరోనా వ్యాక్సిన్‌ను త్వరగా వచ్చేలా చేయాలని భగవంతుడి ఆశీస్సులు కోరుతూ ఈ ఏడాది ధన్వంతరి వినాయకుడిని ప్రతిష్టనుంచనున్నట్టు కమిటీ సభ్యులు వెల్లడించారు. విగ్రహం తయారుచేయడానికి కావాల్సిన మట్టిని గుజరాత్‌ నుంచి తెప్పించనున్నట్టుగా తెలిపారు. అయితే ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడిని హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేయబోమని చెప్పారు. ఉన్న స్థలంలోనే పలు ద్రవాలతో అభిషేకం నిర్వహించి నిమజ్జన ప్రక్రియ పూర్తిచేయనున్నట్టుగా పేర్కొన్నారు. కాగా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తులోనే ఖైరతాబాద్‌ వినాయకుడి విగ్రహం తయారుచేయాలని తొలుత భావించారు. అయితే భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తిల మేరకు తాజాగా   27 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు