ఖైరతాబాద్ వినాయకుడిని అక్కడ నిమజ్జనం చేస్తాం

26 Aug, 2019 16:13 IST|Sakshi

ఖైరతాబాద్‌ గణేశ్‌ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

సాక్షి, ఖైరతాబాద్‌: పోలీసు బందోబస్తు మధ్య వినాయక నిమజ్జనాన్ని నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఖైరతాబాద్‌ గణేశ్‌ పనులను సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 65వ సంవత్సరం జరుగుతున్న వినాయక ఉత్సవాలకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలి వస్తారు కనుక ట్రాఫిక్‌ మళ్లింపు చేపడతామన్నారు. కరెంట్‌ ఇబ్బందులు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ చెప్పినట్టుగా రాష్ట్రంలో అన్ని మతాల పండుగలు అద్భుతంగా జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. వినాయక నిమజ్జనం రోజు ప్రజలు సహకరించాలని కోరారు.

నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌ వినాయకుడి దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దర్శనం చేసుకునేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. హుస్సేన్‌సాగర్‌లో లోతైన ప్రాంతంలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరుగుతుందన్నారు. నగరంలోని వినాయకుల నిమజ్జనం కోసం 32 కొలనులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, పోలీసు శాఖ, ఆర్‌&బీ, జీహెచ్‌ఎంసీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు