సప్తముఖ కాళసర్పుడిగా మహాగణపతి

13 Sep, 2018 12:38 IST|Sakshi
ఖైరతాబాద్‌ వినాయకుడు

సాక్షి, హైదరాబాద్‌: వినాయక చవితి వస్తుందంటే దేశవ్యాప్తంగా అందరి చూపూ ఖైరతాబాద్‌వైపే ఉంటుంది. ఈ ఏడాది ఏ రూపంలో దర్శనమిస్తాడా అని అందరిలోనూ చర్చ మొదలవుతుంది. అందుకు తగ్గట్టే బొజ్జ గణపయ్య వివిధ రూపాల్లో భక్తులకు దర్శమిస్తుంటాడు. ఖైరతాబాద్‌లోని మహాగణపతికి గురువారం ఉదయం 11.52 గంటలకు ప్రథమ పూజ నిర్వహించారు. సప్తముఖ కాళసర్ప మహాగణపతిగా వినాయకుడు దర్శమిచ్చారు. ఈసారి మహాగణపతి 57 అడుగుల ఎత్తులో కొలువుదీరాడు. మహాగణపతి కుడివైపు శ్రీనివాస కల్యాణ ఘట్టం ప్రతిమ ఏర్పాటు చేశారు. ఎడమవైపు శివపార్వతుల విగ్రహాలు పెట్టారు.

అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. తొలిరోజు కావడంతో ఖైరతాబాద్‌ వినాయకుడికి భక్తుల తాకిడి ఎక్కువైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తులు వచ్చే మార్గాలు, దర్శనం చేసుకుని వెళ్లే మార్గాలు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఖైరతాబాదు వినాయకుడిని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి తలసాని, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, కార్పొరేటర్లు మన్నె కవిత, విజయా రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఖైరతాబాద్‌ ఇంచార్జ్ మన్నె గోవర్దన్ రెడ్డి, పరిపూర్ణానంద స్వామి, విజయా రెడ్డి తదితరులు దర్శించుకున్నారు.
 
తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా: నాయిని

తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు నాయిని నర్సింహా రెడ్డి వినాయకుడి దర్శన అనంతరం మీడియాతో తెలిపారు. అన్నిపార్టీల వాళ్లు గెలవాలని కోరుకుంటారు.. ప్రజలకు మంచి చేసిన వాళ్లనే గెలిపించాలని కోరుకున్నానని వెల్లడించారు. అందులో భాగంగానే తాము గెలవాలని ఖైరతాబాద్‌ గణనాథుడిని విన్నవించుకున్నట్లు చెప్పారు.

వినాయకుడి పూజ తర్వాతే ఏదైనా: తలసాని

వినాయకుడి పూజ తర్వాతనే ఏదైనా కార్యక్రమం తలపెడతానని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ తెలిపారు. ఖైరతాబాద్ వినాయకుడిని చూస్తే గానీ తృప్తి కలగదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పండగలను సీఎం కేసీఆర్‌ ఘనంగా నిర్వహిస్తున్నారుని తెలిపారు. ఎంతో శోభాయమానంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో మన పోలీస్ దేశానికే ఆదర్శంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు