మహా గణేశ్‌కు బైబై..

24 Sep, 2018 08:31 IST|Sakshi
సాగర్‌ జలాల్లో మహాగణపతి, ఖైరతాబాద్‌లో ప్రధాన వేదిక నుంచి మహాగణపతి యాత్ర..

5.51 గంటల్లో ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం

ఉదయం 7.05కు శోభా యాత్ర ప్రారంభం..  

12.56 గంటలకు గంగ ఒడికి గణపయ్య

గతేడాది కంటే గంట ముందే నిమజ్జనం

ఖెరతాబాద్‌: ఖైరతాబాద్‌ మహా గణపతికి అశేష భక్తజనం తుది వీడ్కోలు పలికింది. ఆదివారం ఉదయం వేలాది మంది భక్తులు వెంట రాగా ఉదయం 7.05 గంటలకు మండపం నుంచి బయలుదేరిన శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతి హుస్సేన్‌సాగర్‌ ఎన్టీఆర్‌ మార్గ్‌లో క్రేన్‌ నంబర్‌ 6 వద్ద మధ్యాహ్నం 12.56 గంటలకు గంగ ఒడికి చేరాడు. 5.51 గంటల పాటు సాగిన శోభాయత్రకు సందర్శకులు, ప్రముఖులు రాకతో సాగర్‌ ప్రాంగణం కిక్కిరిసింది. యాత్రలో ముందు వినాయకుడి విగ్రహం, వెనుక శ్రీనివాస కల్యాణం సాగాయి. దారిపొడవునా నృత్యాలు, భజనల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పోలీసుల ప్రత్యేక చొరవతో నిమజ్జనం గతేడాదితో పొలిస్తే గంట ముందుగానే ప్రశాంతంగా ముగిసింది. 

రెండున్నర గంటలపాటు బ్రేక్‌..  
ఉదయం 10.20కు సాగర్‌లోని క్రేన్‌ నంబర్‌ 4 వద్దకు చేరుకున్న వినాయకుడిని 40 నిమిషాల పాటు అక్కడే నిలిపారు. అదే సమయంలో అన్ని క్రేన్ల వద్ద ఉన్న పోలీసు సిబ్బంది బడా గణేశ్‌డిని నిమజ్జనం చేసే క్రేన్‌ నంబర్‌ 6 వద్దకు రమ్మని పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో మిగతా క్రేన్‌ల వద్ద నిమజ్జనాలను నిలిపివేశారు. భక్తుల సంఖ్య పెరగడంతో చంటిపిల్లలు ఇబ్బందులు పడ్డారు. 

మహాగణపతి నిమజ్జన యాత్ర ఇలా..  
శనివారం రాత్రి 11 గంటలకు భక్తుల దర్శనం నిలిపివేత
అర్ధరాత్రి 12 గంటలకు మహాగణపతికి వెల్డింగ్‌ పనులు ప్రారంభం
12.50కు ప్రాంగణంలోకి చేరుకున్న క్రేన్‌  
12.55కు ఉత్సవ కమిటీ కలశ పూజ
1.46–2.05 గంటల మధ్య మహాగణపతి ప్రాంగణంలోని శ్రీనివాస కల్యాణం మండపాన్ని క్రేన్‌ సాయంతో వాహనంపై ఉంచారు.  
3.20కు భారీ విగ్రహాన్ని తాళ్ల సాయంతో పైకెత్తారు  
3.30కు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌ చివరి పూజ  
3.40కి ట్రాలర్‌పై మహాగణపతి విగ్రహ  
ఆదివారం ఉదయం 7.05కు ఖైరతాబాద్‌ నుంచి శోభాయాత్ర ప్రారంభం  
8.15కు సెన్సేషన్‌ థియేటర్‌ వద్దకు  
8.35కు రాజ్‌దూత్‌ చౌరస్తా..
8.48కు టెలిఫోన్‌ భవన్, 9.05కు ఎక్బాల్‌ మినార్‌ చౌరస్తా
9.24 సచివాలయం ఓల్డ్‌గేట్‌
10 గంటలకు తెలుగుతల్లి చౌరస్తాకు మహాగణపతి చేరుకోగానే భారీగా తరలివచ్చిన భక్తులు  
10.15కు లుంబినీ పార్కు వద్దకు యాత్ర
10.20– 11.10 వరకు మహాగణపతి క్రేన్‌ నెం–4వద్దే దాదాపు 40 నిమిషాలు నిలిపివేశారు. ఈ సమయంలో భక్తుల తాకిడి పెరిగింది.
11.25కి ఎన్టీఆర్‌ మార్గ్‌ క్రేన్‌ నెం–6 వద్దకు చేరుకున్న విగ్రహం  
11.42కు మహాగణపతికి తుది పూజలు ప్రారంభం. తాజా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్, సీపీ అంజనీకుమార్, మాజీ చింతల రామచంద్రారెడ్డి, భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంతరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.  
12.35కు కలశ పూజ, భక్తులకు మంత్ర జలం..  
12.56కు మహాగణపతి సాగర్‌ నిమజ్జనం.   

ట్రాలర్‌కు అందంగా అలంకరణ
మహాగణపతి నిమజ్జనానికి తరలించే ఎస్‌టీసీ ట్రాలర్‌ వాహనాన్ని ఆదివారం తెల్లవారు జామున కొబ్బరాకులు, అరటి చెట్లు, మామిడి తోరణాలు, బంతిపూలతో అందంగా అలంకరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఏకరూప దుస్తుల్లో నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు.

హైడ్రాలిక్‌ క్రేన్‌ సాయంతో నిమజ్జనం
ఖైరతాబాద్‌: శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆధునిక జర్మన్‌ టెక్నాలజీతో తయారు చేసిన మోడ్రన్‌ క్రేన్‌ను వినియోగించారు. గతేడాది రవి క్రేన్స్‌కు చెందిన క్రేన్‌తో నిమజ్జనం చేశారు. అయితే నిమజ్జన సమయంలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ ఏడాది రవి క్రేన్స్‌ రాకపోవడంతో హైడ్రాలిక్‌ ఆధునిక రిమోట్‌ కంట్రోల్‌ టెక్నాలజీ క్రేన్‌తో నిమజ్జనం చేశారు. 

హైడ్రాలిక్‌ మోడ్రన్‌ క్రేన్‌..
తడానో కంపెనీ తయారు చేసిన మోడ్రన్‌ క్రేన్‌ హైడ్రాలిక్‌ రిమోట్‌ కంట్రోల్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది 400 టన్నుల బరువును అవలీలగా పైకెత్తుతుంది. దీని జాక్‌ 60 మీటర్ల పైకి లేస్తుంది. 14 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు ఉండే క్రేన్‌కు 12 టైర్లు ఉంటాయి. ఒక్కో టైర్‌ టన్ను బరువుంది. 45 టన్నులున్న మహాగణపతిని సునాయాసంగా సాగర్‌లో నిమజ్జనం చేశారు.

సంతోషంగా ఉంది..
దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ మహాగణపతిని నిమజ్జనం చేసే భాగ్యం దక్కినందుకు ఆనందంగా ఉంది. తొలిసారి ఈ క్రతువులో పాలుపంచుకున్నా. క్రేన్‌ ఆపరేటింగ్‌లో పదేళ్ల అనుభవం ఉంది. ఈ హైడ్రాలిక్‌ క్రేన్‌ను రెండేళ్ల నుంచి ఆపరేట్‌ చేస్తున్నా.    – దేవేందర్‌ సింగ్, పంజాబ్‌

మరిన్ని వార్తలు